టీకా కావాలంటే ఎన్నికల షెడ్యూల్‌ చూడాలి!

బిహార్‌ ఎన్నికల్లో భాగంగా భాజపా చేసిన ఉచిత కొవిడ్‌ టీకా హామీపై రాహుల్‌గాంధీ విభిన్నంగా స్పందించారు. జీవితాల్ని కాపాడే కరోనా టీకాను భాజపా ఎన్నికలతో ముడిపెట్టిందని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వి

Published : 22 Oct 2020 20:06 IST

దిల్లీ: బిహార్‌ ఎన్నికల్లో భాగంగా భాజపా చేసిన ఉచిత కొవిడ్‌ టీకా హామీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విభిన్నంగా స్పందించారు. జీవితాల్ని కాపాడే కరోనా టీకాను భాజపా ఎన్నికలతో ముడిపెట్టిందని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌పై తమ వ్యూహాలను ప్రకటించింది. దీని బట్టి మనకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందాలంటే రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసుకోవాలి’అంటూ వ్యంగ్యంగా ప్రస్తావించారు. భాజపా ప్రకటించిన ఈ హామీపై ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం తీవ్రంగా స్పందించారు. బిహార్‌ ప్రజలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తే.. మరి భాజపా అధికారంలో లేని రాష్ట్రాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. భాజపాకు ఓటు వేయని భారతీయులకు ఉచితంగా టీకా అందజేయరా?అని ప్రశ్నించారు. 

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ భాజపా మేనిఫెస్టోను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే కొవిడ్‌-19 టీకా భారీ స్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. బిహార్‌లో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం. ఎన్నికల హామీల్లో దీనికే మొదటి ప్రాధాన్యత’అని ప్రకటించారు. కాగా ఈ హామీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని