
కేటీఆర్ తక్షణమే నగరంలో పర్యటించాలి:రేవంత్
హైదరాబాద్: నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాలనీలు మునిగిపోతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకి అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తక్షణమే నగరంలో పర్యటించి నాలాల స్థితిగతులు, మ్యాన్ హోళ్లను పరిశీలించాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నగరంలోని డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరమైన సహాయ సహకారాలందించాలని రేవంత్ రెడ్డి సూచించారు.