సింధియా జీత్‌ గయా!

రెండు సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి పరాభవం ఎదురయ్యింది.

Published : 10 Nov 2020 16:41 IST

పార్టీ మారినా.. యువనేతవైపే ఓటర్లు
మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో భాజపా ఘన విజయం

భోపాల్‌‌: రెండు సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి పరాభవం ఎదురయ్యింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో దూసుకుపోయింది. దీంతో శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది. అయితే, ఉప ఎన్నికల్లో భాజపా విజయంలో యువనేత జ్యోతిరాదిత్య సింధియానే కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని వీడి, ఆయన వెంటవచ్చిన వారిలో దాదాపు 21 మందిని గెలిపించుకోవడంలో సింధియా విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యువనేత వైపే ఓటర్లు..!
కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి భాజపా తీర్థం పుచ్చుకున్న సింధియా వర్గం వైపే ఓటర్లు ఉన్నట్లు ప్రస్తుత ఉపఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తోంది. ముమ్మర ప్రచారం చేయడం, ఆయన ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా పోవడంతో భాజపా విజయం మరింత సులువైనట్లు తెలుస్తోంది. 
కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారడం, ఆయనతోపాటే దాదాపు 20మందికిపైగా ఎమ్మెల్యేలు భాజపాలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆరు స్థానాల్లోనే తన ప్రభావాన్ని చూపగలిగింది. దీంతో సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడడంతో‌ ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు లేకుండా పోయాయి. ప్రస్తుతం 28 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాల్లో మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది.

కమలనాథ్ వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం..?
జ్యోతిరాదిత్య సింధియా వర్గం పార్టీని వీడడంతో నష్టపోయిన కాంగ్రెస్‌కు, ఉప ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ వ్యవహారం ఓటమికి కారణమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీనియర్‌ నేతగా ఉన్న కమల్‌నాథ్,‌ ఓ రాష్ట్ర మహిళా మంత్రిని అసభ్య పదజాలంతో సంభోధించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అంతేకాకుండా ప్రచారంలో కమల్‌నాథ్‌ ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘించడంతో స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆయన ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే కమల్‌నాథ్‌ ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఖర్చులన్నీ సంబంధిత అభ్యర్థులే భరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇలా, కీలక ఎన్నికల సమయంలో కమల్‌నాథ్‌ వ్యవహారం ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే, 230 అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్‌లో సింధియా వర్గం సహాయంతో గత మార్చి నెలలో భాజపా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి సింధియా వర్గం భాజపాలో చేరడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాజాగా 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 116 సీట్లు పొందాల్సి ఉంది. ఇప్పటికే భాజపాకు 107 సభ్యులు ఉండగా ప్రస్తుత ఉప ఎన్నికల్లో మరో 20కిపైగా సీట్లు లభించాయి. దీంతో స్థిరమైన ప్రభుత్వానికి అవసరమైన స్థానాలను శివరాజ్‌ సింగ్‌ నేతృత్వంలోని భాజపా సాధించగలిగింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌తోపాటు కమల్‌నాథ్‌కు మరోసారి తీవ్ర పరాభవం ఎదురయ్యింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని