కంగనకేనా భద్రత.. బాధితులకు లేదా?

హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్‌’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది

Published : 06 Oct 2020 13:42 IST

హాథ్రస్‌ ఘటనలో కేంద్రంపై శివసేన విమర్శలు

ముంబయి: హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్‌’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది. ఈ మేరకు తమ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. 

‘హాథ్రస్‌ ఘటనలో బాధిత కుటుంబం బెదిరింపులు ఎదుర్కొంటూ భయంభయంగా బతుకుతోంది. అలాంటప్పుడు వారికి వై ప్లస్‌ భద్రత కల్పించమని డిమాండ్‌ చేయడంలో తప్పేముంది. మొన్నటికి మొన్న ముంబయిలో ఓ నటి(కంగనా రనౌత్‌)కి కేంద్రం వై ప్లస్‌ భద్రత ఇచ్చింది. కానీ హాథ్రస్‌ బాధిత కుటుంబానికి మాత్రం రక్షణ ఇవ్వట్లేదు. ఇది సమాన న్యాయం అనిపించుకోదు. డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి న్యాయం ఎక్కడా లేదు’ అని శివసేన దుయ్యబట్టింది. 

అంతేగాక, హాథ్రస్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడంపై కూడా శివసేన అనుమానాలు వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం జ్యుడీషియల్‌ విచారణ కోరుతుంటే.. సీబీఐ దర్యాప్తు ఎందుకు అని ప్రశ్నించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతురాలి అంత్యక్రియలను హుటాహుటిన జరిపించారని ఆరోపించింది.  

గత నెల బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆఫీస్‌ కూల్చివేత వ్యవహారంలో కేంద్రం ఆమెకు వై ప్లస్‌ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ముంబయి పోలీసుల నుంచి తనకు ప్రమాదం ఉందని కంగన వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం ఆమెకు రక్షణ కల్పించింది. ఇదే వ్యవహారంపై సామ్నా ఇప్పుడు కేంద్రానికి చురకలంటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని