ప్రధాని ప్రసంగంపై శివసేన విసుర్లు

రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా వ్యంగ్యంగా స్పందించింది.

Published : 22 Oct 2020 18:53 IST

సామ్నాలో వ్యంగ్యంగా స్పందించిన శివసేన

దిల్లీ: రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా వ్యంగ్యంగా స్పందించింది. గత ఏడెనిమిది నెలల్లో ఆయన చేసిన ప్రసంగాల్లో ఇదే గొప్పదంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ఒక బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా మాట్లాడారని, అది ఆధ్యాత్మికంగా ఉందని రాసుకొచ్చింది.

‘కరోనా గురించి మోదీ చేసిన ఏడెనిమిది నిమిషాల ప్రసంగం గత ఏడెనిమిది నెలల్లోనే గొప్పది. ఆయన ఒక బాధ్యతాయుతమైన రక్షకుడిగా కనిపించారు. ఆయన వచ్చారు, మాట్లాడారు.  ఆయన మోము వెలిగిపోయింది. ఆ వెలుగు మనం ఎదుర్కొనే చీకట్లను తరిమి కొడుతుంది’ అంటూ శివసేన తన సంపాదకీయంలో వ్యంగ్యంగా రాసుకొచ్చింది. అలాగే ఆయన నిరుద్యోగ సమస్యపై మాట్లాడకపోవడాన్ని విమర్శిస్తూ..‘ప్రధాని దేశ ఆర్థిక టర్నోవర్‌ పెరుగుతోందన్నారు. కానీ, కరోనా వైరస్‌ విజృంభణ తరవాత దేశాన్ని పీడిస్తోన్న నిరుద్యోగాన్ని ఎలా నియంత్రిస్తారనే దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. దానిపై ఆయన ప్రకటన చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, ఆయన తప్పించుకున్నారు. మోదీ తన ప్రసంగంలో ఏమి ఇచ్చారు? దాంట్లో కొత్తేముంది? వరదలతో ప్రభావితమైన మహారాష్ట్రకు ఏదైనా ఆర్థిక సహాయం చేశారా? ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ..ఆయన ప్రసంగం ప్రభావవంతంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.  

పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ మంగళవారం చేసిన ప్రసంగంలో ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. వ్యాధిని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించడంతో పాటు..వ్యాక్సిన్‌ చివరి వ్యక్తికి చేరే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు