బిహార్‌ ఎన్నికలు: 50స్థానాల్లో శివసేన పోటీ!

మరికొద్ది రోజుల్లో జరిగే బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు శివసేన పార్టీ సిద్ధమైంది.

Published : 12 Oct 2020 01:12 IST

పట్నా: మరికొద్ది రోజుల్లో జరిగే బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏ పార్టీతోనూ చేతులు కలిపేది లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన స్పష్టం చేసింది. ‘బిహార్‌లో దాదాపు 50స్థానాల్లో పోటీ చేస్తాం. ఇప్పటికే మా అభ్యర్థులను ప్రచారానికి సంసిద్ధం చేశాం’ అని శివసేన ఎంపీ అనిల్‌ దేశాయ్‌ వెల్లడించారు. త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బిహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రచార బృందం జాబితాను ఉద్ధవ్‌ కుమారుడు, మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంలో శివసేన ఎంపీ అనిల్‌ దేశాయ్‌తో పాటు, సంజయ్‌ రౌత్‌, సుభాష్‌ దేశాయ్‌, వినాయక్‌ రౌత్‌, అరవింద్‌ సావంత్‌, ప్రియాంక చతుర్వేదీ వంటి నేతలు పాల్గొనే అవకాశం ఉంది.

క, బిహార్‌లో దిగ్గజ నేతగా ఉన్న కేంద్ర మంత్రి, లోక్‌ జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) నేత పాస్వాన్‌ మరణంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే ఎన్‌డీఏ నుంచి ఎల్‌జేపీ బయటకు వచ్చి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే, భాజపా అభ్యర్థులపై మాత్రం పోటీచేయబోమని పేర్కొంది. పాస్వాన్‌ మరణంతో సానుభూతిని ఓట్ల రూపంలో మలచుకొనేందుకు ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాస్వాన్‌ ప్రయత్నించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూ అధినేత నితీశ్‌పై ప్రభావం చూపే అవకాశాలున్నట్లు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలకు అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 7వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 10న కౌంటింగ్‌ జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని