
రజనీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా?
అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోన్న వైరల్ లేఖ
స్పందించిన తలైవా
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాట ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ వైరల్ అవడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. దీంతో స్పందించిన రజనీ.. ఆ లేఖ తాను రాసింది కాదని చెప్పారు. అయితే రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లేఖలో ఏముంది..
రజనీ పేరుతో బుధవారం ఓ లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ‘నా ప్రాణం గురించి నాకు భయం లేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ల క్షేమం గురించి ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఈ రంగంలోకి రావాలనుకున్నా. మధ్యలో నా ఆరోగ్యం క్షీణిస్తే అది కొత్త సవాళ్లకు దారితీస్తుంది. నాకు కిడ్నీ సమస్య ఉంది. డయాలసిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినా కూడా బయటకు వెళ్లడం ప్రమాదకరమని సూచించారు. అయినప్పటికీ ముందుకెళ్లాలంటే జనవరి 15లోగా రాజకీయ పార్టీ ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అభిమానులు, ప్రజలకే వదిలేస్తున్నా’ అని రజనీ అభిమానులను కోరినట్లు ఆ లేఖలో ఉంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
రజనీ ఏం చెప్పారంటే..
సోషల్‌మీడియాలో ఈ లేఖ వైరల్ అవడంతో రజనీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ లేఖ తాను రాసింది కాదని స్పష్టం చేశారు. అయితే అందులో తన ఆరోగ్యం గురించిన సమాచారం నిజమేనని చెప్పారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యులను కలిసి వారి సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఇక రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. దీనిపై రజనీ మక్కల్ మండ్రమ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. త్వరలోనే పార్టీ, రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ‘ఆ లేఖ నాది కాదు. అయితే అందులోని నా ఆరోగ్య సమాచారం నిజమే. సరైన సమయంలో నా రాజకీయ ఆలోచన గురించి ప్రకటిస్తా’ అని తలైవా స్పష్టం చేశారు.
నిజానికి తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ మూడేళ్ల కిందటే ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తలైవా.. ‘ముఖ్యమంత్రిని అవ్వాలని ఎన్నికల్లో పోటీ చేయను’ అని చెప్పారు. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు భావించారు. అయితే ఇప్పటివరకు దీనిపై స్పష్టత మాత్రం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.