ఒక్క అవకాశమివ్వాలని..
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది.
రఘునందన్‌కు తొలి విజయం సాధ్యమైందిలా!
ఇంటర్నెట్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో భాజపా తొలి రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించింది. కొన్ని రౌండ్లలో భాజపాను తెరాస అధిగమించినప్పటికీ చివర్లో మళ్లీ కాషాయ పార్టీ పుంజుకుని 1,470 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని ముద్దాడింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. భాజపా విజయానికి రఘునందన్‌రావు వ్యక్తిగత ఛరిష్మా, సానుభూతి కలిసి వచ్చాయి. ఒక్కసారి అవకాశమివ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన విజ్ఞప్తితో వచ్చిన సానుభూతి.. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటాననే ప్రచారం రఘునందన్‌ను విజయతీరాలకు చేర్చాయి.
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి..
రఘునందన్‌రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. అనంతరం సిద్దిపేట నుంచి పటాన్‌చెరుకు తన నివాసాన్ని మార్చుకుని కొన్నాళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తితో 2001లో రఘునందన్‌రావు తెరాసలో చేరి తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగారు. దశాబ్దానికి పైగా తెరాసలో కొనసాగిన ఆయన్ను 2013లో ఆ పార్టీ సస్పెండ్ చేసింది. తెదేపాతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ఆరోపణలపై రఘునందన్‌ను తెరాస బయటకు పంపింది. అనంతరంలో ఆయన భాజపాలో చేరి 2014 ఎన్నికల్లో దుబ్బాక అభ్యర్థిగా బరిలో నిలిచారు.
రఘునందన్ వ్యక్తిగత ఛరిష్మా.. నాయకత్వం దూకుడు
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయం సాధించడంలో పార్టీ నేపథ్యం కంటే రఘునందన్ వ్యక్తిగత ఛరిష్మానే ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పొచ్చు. సమకాలీన అంశాలపై మంచి పట్టు, వాగ్ధాటి, సూటిగా ప్రశ్నించే తత్వం.. ఇవన్నీ ఆయన పట్ల సానుకూల ప్రభావాన్ని తీసుకొచ్చాయి. చర్చా కార్యక్రమాలు, సోషల్ మీడియాల్లో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా రఘునందన్ సంధించే వాగ్బాణాలు ప్రజల్ని కొంతమేర ఆకర్షించాయి. మరోవైపు సోషల్ మీడియాలో భాజపా శ్రేణులు విశేషంగా ప్రచారం నిర్వహించాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఆ పార్టీ నేతల దూకుడు కూడా విజయానికి దోహదపడింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
కలిసొచ్చిన సానుభూతి
రఘునందన్‌రావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ స్థానం నుంచి 2019లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ మూడు సార్లూ ఆయనకు ఓటమి తప్పలేదు. 2014, 2018 ఎన్నికల్లో రఘునందన్‌పై తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ రఘునందన్‌పై తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. దీంతో ఈ ఉపఎన్నికను రఘునందన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రజలకు సైతం ఆయనపై కొంత సానుభూతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనకు అవకాశమివ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరడం రఘునందన్ కలిసొచ్చింది. మరోవైపు పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు జరిగిన పరిణామాలు కాషాయ పార్టీకి లాభించాయి. సిద్దిపేటలో రఘునందన్ బంధువుల ఇళ్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేయడంతో నగదు పట్టుపడిందంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అక్కడ భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్దేశపూర్వకంగా భాజపాకు ఇబ్బందులు సృష్టించేందుకే అధికార తెరాస ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ రఘునందన్ ఆరోపించారు. అదే సమయంలో సిద్దిపేటకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేరుకుని రఘునందన్‌ను పరామర్శించారు. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడికి చేరుకోవడం.. సిద్దిపేట సీపీతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసి కరీంనగర్ పంపడం తదితర పరిణామాలు ఆ పార్టీపై కొంత సానుభూతి కలిగేలా చేశాయి.
భాజపా విజయానికి కారణాలివేనా!
రఘునందన్‌రావు అక్కడి ప్రజలకు సుపరిచితులు కావడం, నిరుద్యోగ అంశం, యువ ఓటర్లు ఆయన వైపు వైపు మొగ్గు చూపడం ఉప ఎన్నికలో కీలకాంశాలుగా మారాయి. దుబ్బాకను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. అక్కడ పోల్‌మేనేజ్‌మెంట్ పకడ్బందీగా అమలు చేసింది. ప్రజలు కూడా మార్పును కోరుకోవడం రఘునందన్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యువత భాజపా తరఫున ప్రచారం చేయడం కూడా పార్టీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దీనికి తోడు భాజపా నేతలు అక్కడ పదునైన ప్రచారంతో దూకుడును ప్రదర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకొని మాటల తూటాలతో ప్రజలను తమవైపు ఆకర్షించుకోగలిగారు. తెరాస అభ్యర్థి సుజాత ఆకట్టుకొనేలా మాట్లాడలేకపోవడం.. రఘునందన్ వాక్చాతుర్యం కూడా భాజపా విజయానికి బాగా కలిసొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉందంటూ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా ఓటర్లను ఆ పార్టీ తమవైపు తిప్పుకోవడంలో పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దుబ్బాకకు చుట్టుపక్కల నియోజకవర్గాలుగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లను తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేసినా దుబ్బాకను పట్టించుకోలేదంటూ భాజపా చేపట్టిన ప్రచారమూ తెరాస ఓటమికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sania Mirza: కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా
-
Politics News
Nara Lokesh: శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేకపూజలు
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్