సవాళ్లను జయించి..మహానగరంగా..!

దేశంలో హైదరాబాద్‌ స్థానం విశిష్టమైనది. కుల, మత, ప్రాంత, వర్ణ తారతమ్యాలేమీ లేకుండా ఎందరినో ఆదరించి అక్కున చేర్చుకుంది.. అంతకుమించి

Updated : 21 Nov 2020 16:28 IST

ఆటుపోట్లు తట్టుకుని ఆశ్రయం కల్పిస్తోన్న భాగ్యనగరం
మినీ ఇండియాగా హైదరాబాద్‌కు కీర్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో హైదరాబాద్‌ స్థానం విశిష్టమైనది. నగరంలో జరుగుతున్న అభివృద్ధితో క్రమంగా విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల రూపంలో కొన్ని కోట్ల మందికి భరోసా కల్పిస్తున్న భాగ్యనగరం.. తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అనేక కష్టాలను తట్టుకొని నిలబడి ఇప్పుడు అందరికీ ఆశ్రయం కల్పిస్తోంది. ‘‘మహా సముద్రాన్ని మత్స్యసంపదతో నింపినట్లు నా నగరాన్ని మనుషులతో నింపు’’ హైదరాబాద్‌ నగర నిర్మాణాన్ని ప్రారంభించిన కులీకుతుబ్‌షా ఇలా ప్రార్థించారట. ఆయన మాట్లాడిన వేళా విశేషమేమో కానీ.. కొన్నేళ్లుగా జనాభాతో పాటు అంతే వేగంగా నగరమూ అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరం ఎనిమిది దిక్కుల్లోనూ ఎటునుంచి ఎటు చూసినా 50-60 కి.మీ మేర విస్తరించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ చరిత్రను ఓసారి క్లుప్తంగా పరిశీలిస్తే..

ప్లేగు నుంచి బయటపడి.. తట్టుకుని నిలబడి..
హైదరాబాద్‌ అనగానే తొలుత గుర్తొచ్చేది చార్మినారే. ఇది మధ్యయుగంలో సామాన్య ప్రజానీకం కోసం నిర్మించిన గొప్పకట్టడం. కుతుబ్‌షా వంశంలో ఐదో పాలకుడు, హైదరాబాద్‌ నగర స్థాపనకు మూలపురుషుడైన మహమ్మద్‌ కులీకుతుబ్‌షా క్రీ.శ.1591-92లో చార్మినార్‌ను నిర్మించారు. అప్పట్లో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. వందలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. క్రమంగా ఆ మహమ్మారిని తరిమికొట్టి.. ఆ విజయానికి గుర్తుగా దీన్ని కట్టారు. ప్లేగును జయించడంతో ఓ మహా ఉత్పాతాన్ని నగరం తట్టుకొని నిలబడినట్లయింది. అనంతర కాలంలో వరదలు నగరాన్ని ఇబ్బంది పెట్టాయి. 

మూసీ జలప్రళయం.. 

 1800 బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీతో నిజాం పాలకులు సైన్యసహకార పద్ధతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఒకట్రెండు అల్లర్లు, అంటువ్యాధులు మినహా పెద్ద ఆటుపోట్లేమీ నగరానికి రాలేదు. అయితే 1908లో మాత్రం నగరానికి ప్రధాన నీటి వనరైన మూసీ నది జలప్రళయంలా నగరాన్ని ముంచెత్తింది. మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో 1908 సెప్టెంబరులో ఓ రోజు రాత్రి మూసీకి వరద పోటెత్తింది. అంతకుముందు రెండురోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఎగువున ఉన్న చిన్నాపెద్దా చెరువు కట్టలన్నీ తెగిపోయాయి. రాజధాని చుట్టూ ఉన్న సుమారు 800 చెరువుల్లో 221 చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ నీరంతా మూసీ నదిలో వచ్చి చేరింది. నదిలో సెకనుకు 1,10,000 ఘనపుటడుగుల నీరు ప్రవహించింది. అది కొద్ది గంటల్లోనే 4,25,000 ఘనపుటడగులకు చేరింది. ఈ క్రమంలో ప్రజలంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ మూసీ విరుచుకుపడింది. అంతవరకు అలాంటి ఉత్పాతాన్ని నగర  ప్రజలు ఎదుర్కోలేదు. ఉగ్రరూపం దాల్చిన మూసీ.. తన మార్గంలో ఎదురుపడిన ప్రతి దానినీ ధ్వంసం చేసేసింది. మూసీ విధ్వంసానికి సుమారు 15వేల మంది మృత్యువాత పడినట్లు.. అంతకు రెండింతల మంది నిరాశ్రయులైనట్లు అంచనా. సుమారు 25వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే మూసీ సృష్టించిన ప్రళయాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. 

భాగ్యనగరం.. మినీ ఇండియా!

అనంతరకాలంలో చిన్నపాటి ఘటనలు మినహా హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందికర పరిస్థితులేమీ ఎదురుకాలేదు. నగరంలో క్రమంగా అభివృద్ధి ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే అప్పటి ప్రభుత్వాలు ప్రధానంగా భాగ్యనగరం అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించడంతో అనేక సంస్థలు నగరానికి వచ్చాయి. పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి. నగర శివారు ప్రాంతాల్లో ఫార్మా సహా వందలాది ఇతర సంస్థలు వెలిశాయి. ఉన్నత విద్యకోసం ఎంతోమంది దేశవిదేశాల నుంచి భాగ్యనగరానికి రావడం మొదలుపెట్టారు.  దీంతో స్థానికంగా ఉన్నవారికీ ఉపాధి అవకాశాలు లభించాయి.

ముఖ్యంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో సాంకేతికంగానూ నగర కీర్తి ప్రపంచానికి తెలిసింది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలతో హైదరాబాద్‌ మినీ ఇండియాగా పేరుగాంచింది. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలనూ భాగ్యనగరం ఆదరించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత నగర అభివృద్ధిపై ఇప్పటి తెరాస ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించింది. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ఆరేళ్ల వ్యవధిలో నగరంలో సుమారు రూ.70వేలకోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. మెట్రోరైలు నగరానికే తలమానికంగా వెలుగొందుతోంది.  

‘ఉగ్ర’ మరకలు

 చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిన నగర వాతావరణం.. పలుమార్లు ఉగ్రభూతంతో ఉక్కిరిబిక్కిరైంది. ఐఎస్‌ఐ జాడలు వెలుగులో వచ్చాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థల ఉనికి, సానుభూతిపరుల ఆనవాళ్లు కనిపించాయి.  2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లతో పాతబస్తీ అట్టుడికింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. తర్వాత జరిగిన అల్లర్లు, పోలీసు కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు వందమందికి గాయాలయ్యాయి. అదే ఏడాది ఆగస్టు 25న లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌ ప్రాంతాల్లో జరిగిన వరుస పేలుళ్లతో భాగ్యనగరం వణికింది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా 2013 ఫిబ్రవరి 21న మళ్లీ వరుస పేలుళ్లతో హైదరాబాద్‌ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బస్‌స్టాప్‌, ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద బాంబుల మోతతో 17 మంది మరణించారు. ఈ ఘటనలో సుమారు 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఈ ఘటనలు మినహా భాగ్యనగర చరిత్రలో మరకలేమీ లేవు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని