భాజపాలో చేరిన స్వామిగౌడ్‌

తెరాస నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాలో చేరారు. గత కొంతకాలంగా ఆయన భాజపాలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ భాజపాలో చేరినట్లు ప్రకటించారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో..

Published : 26 Nov 2020 01:40 IST

హైదరాబాద్‌: తెరాస నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాలో చేరారు. గత కొంతకాలంగా ఆయన భాజపాలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ భాజపాలో చేరినట్లు ప్రకటించారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపాలో చేరడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని.. భాజపాను తన మాతృ సంస్థగా భావిస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయని స్వామిగౌడ్‌ అన్నారు.

ఉద్యమంలో పాల్గొననివారు, ఏనాడూ ధర్నాలు చేయనివారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రతాంబూలం ఇచ్చి ఉద్యమకారులను పక్కన పెట్టడం ఎంతో బాధించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు కనీస మర్యాదకు కూడా నోచుకోలేదా? అని ప్రశ్నించారు. ఆయన తండ్రిగా భావించే సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో ఎందుకు అలసత్వం వహించారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రెండేళ్లలో కనీసం వందసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించానని.. వారం క్రితం కూడా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మాభిమానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తెరాసను వీడుతున్నట్లు చెప్పారు. పదవుల కోసం కాదని.. ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడడం కోసమే భాజపాతో చేరుతున్నట్లు స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని