ఏపీలో సీపీఐ, తెదేపా నేతల గృహనిర్బంధం

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో సముదాయాల్లో గృహ ప్రవేశాలకు సీపీఐ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం

Updated : 16 Nov 2020 11:53 IST

గుంటూరు: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో సముదాయాల్లో గృహ ప్రవేశాలకు సీపీఐ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం, సీపీఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తాడేపల్లిలో సీపీఐ నేత రామకృష్ణను గృహనిర్బంధం చేశారు. తుళ్లూరులో సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును అరెస్టు చేసి అమరావతి పీఎస్‌కు తరలించారు. మచిలీపట్నంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబును గృహ నిర్బంధం చేశారు. 

విశాఖ జిల్లా వాంబే కాలనీలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల నిర్వహణను అడ్డుకున్న పోలీసులు 25మంది సీపీఐ జిల్లా నేతలు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ను గృహ నిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో టిడ్కో గృహాల వద్దకు ర్యాలీగా వెళ్తున్న సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

 

రాష్ట్ర సీపీఐ పిలుపు మేరకు కడప శివారులోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులతో గృహ ప్రవేశానికి సీపీఐ నాయకులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్నప్పటికీ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పార్టీ కార్యర్తలతోపాటు టిడ్కో లబ్ధిదారులతో కలిసి ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సీపీఐ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు మరికొంతమంది మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ చిన్నచౌకు పోలీసు స్టేషన్‌కు తరలించారు. టిడ్కో ఇళ్లను తాము ఆక్రమించడం లేదని.. లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తున్నామని ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ఇదే సమయంలో కొందరు లబ్ధిదారులు పోలీసుల కళ్లుగప్పి టిడ్కో ఇళ్లలోకి వెళ్లి గృహ ప్రవేశం చేశారు. ఇంట్లో పాలు కూడా పొంగించేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని