
10సార్లు దిల్లీ వెళ్లి ఏం ఒరగబెట్టారు?:చంద్రబాబు
అమరావతి: సీఎం జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమా?రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 10సార్లు దిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని నిలదీశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని తెదేపా నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ రైల్వే జోన్కు నిధులు, కడప ఉక్కు పరిశ్రమ, పెట్రోలియం కాంప్లెక్స్, తొలి ఏడాది ఆర్థికలోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులేమైనా అడిగారా? అని సీఎంను ప్రశ్నించారు. ఆరోజేం చెప్పారు? ఈరోజేం చేస్తున్నారని నిలదీశారు. అప్పుడు మెడలు వంచుతామని చెప్పి.. ఇప్పుడు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
గోదావరి జిల్లాల్లో పులివెందుల మార్కు ఫ్యాక్షనిజం
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తెదేపా గెలుపుతో వైకాపా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల్లోని బాధితులంతా ఏకమై వైకాపాకు బుద్ధి చెప్పాలన్నారు. వైకాపా దాడుల్లో అన్ని వర్గాలూ బాధితులేనని ఆయన ఆరోపించారు. తెదేపాతో ప్రారంభించి అన్ని వర్గాలపైనా దౌర్జన్యాలకు తెగబడ్డారన్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోనూ పులివెందుల మార్కు ఫ్యాక్షనిజం తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, ఉపాధి, ఉద్యోగాలు, పెట్టుబడులు అప్పుడెలా ఉన్నాయి.. ఇప్పుడు పరిస్థితేంటని చంద్రబాబు నిలదీశారు. తెదేపా పాలనలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే ఇప్పుడు పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీలపై జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. సురక్షిత తాగునీరు ఇవ్వలేని వాళ్లకు పాలించే యోగ్యత లేదన్నారు. బాధిత ప్రజలంతా తిరగబడితే వైకాపా తోక ముడవటం ఖాయమని చంద్రబాబు చెప్పారు.