సంచయిత ఎందుకిలా చేస్తోందో?: అశోక్‌గజపతి

మాన్సాస్‌ ట్రస్టు విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా చీకటి జీవోలను తీసుకొస్తోందని కేంద్ర మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ఆరోపించారు.

Published : 18 Nov 2020 00:34 IST

విజయనగరం అర్బన్: మాన్సాస్‌ ట్రస్టు విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా చీకటి జీవోలను తీసుకొస్తోందని కేంద్ర మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. సింహాచలం పరిధిలో ఉన్న 104 ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్‌ను తొలగించి మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచయితను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో విజయనగరంలోని బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించే విషయంలో తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడంపై అశోక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా ఆ పదవి నుంచి తనను తొలగించారని ఆరోపించారు. ఛైర్మన్‌ పదవి ఆనవాయితీగా వచ్చేదని.. కోర్టు తీర్పులు, ఆనవాయితీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని ఆక్షేపించారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు కుటుంబాన్ని అభాసుపాలు చేస్తున్నాయని పరోక్షంగా మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ సంచయితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆమె ఎందుకిలా చేస్తుందో అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. 
మాన్సాస్‌ ఆస్తి దేవాలయాలదే..

మాన్సాస్‌ వ్యవహారాన్ని మంత్రి బొత్స కుటుంబ తగాదాగా పేర్కొనడాన్ని అశోక్‌ గజపతిరాజు తప్పుబట్టారు. ఇది కుటుంబ ఆస్తికాదని.. ఆస్తులన్నీ దేవాలయాలకే చెందుతాయని చెప్పారు. ఇందులో ఒక్కపైసా కూడా తాను ముట్టుకోలేదన్నారు. భక్తులు హుండీలో వేస్తే కుటుంబ ఆస్తి ఎలా అవుతుందని బొత్సను ప్రశ్నించారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఘటన, మాన్సాస్‌ విద్యా సంస్థల్లో ఉద్యోగులు భిక్షాటన చేయడం బాధాకరమన్నారు. తాత, తండ్రి ఎవరో తెలియని సంచయిత.. 105 దేవాలయాల్లో ఒక్క పండగకైనా వచ్చి ఉంటే కోట బురుజు వద్ద ఎలా ప్రవర్తించాలో తెలిసేదని వ్యాఖ్యానించారు.  మరోవైపు ఇటీవల తాను ప్రధాని మోదీని కలిశానని.. పార్టీ మారుతున్నానంటూ వస్తోన్న వార్తలు వాస్తవం కాదని అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. తెదేపా ఆవిర్భావం నుంచి అందులో ఉన్నానని.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని