విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కోర్టుకెళతాం:తెదేపా

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అసంబద్ధమైన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించారని తెదేపా ఎంపీలు ఆరోపించారు.

Updated : 17 Sep 2020 16:49 IST

దిల్లీ: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అసంబద్ధమైన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించారని తెదేపా ఎంపీలు ఆరోపించారు. న్యాయస్థానాలపై అభాండాలు వేశారని విమర్శించారు. పార్లమెంట్‌ ఆవరణలో తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలు ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించవని కనకమేడల అన్నారు. పార్లమెంట్‌లో జరిగే చర్చను రాజకీయం చేయాలనేదే విజయసాయిరెడ్డి లక్ష్యమని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నాయన్నారు. వైకాపాపై వచ్చే ఆరోపణలను తప్పుదారి పట్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని జగన్‌ ప్రభుత్వం ఎత్తుకుందని విమర్శించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కనకమేడల స్పష్టం చేశారు. 

న్యాయస్థానాలను బ్లాక్‌మెయిల్‌ చేయాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. నిన్న లోక్‌సభలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడిందే.. నేడు రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడారని ఆక్షేపించారు. వైకాపాలో తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించిన వాళ్లకే పదవులు వస్తున్నాయన్నారు. వైఎస్సార్‌ పేరు కంటే చంద్రబాబు జపమే ఎక్కువగా చేస్తున్నారని రామ్మోహన్‌ నాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కొవిడ్‌-19పై చర్చ జరుగుతుంటే విజయసాయిరెడ్డి మాత్రం న్యాయస్థానాలపై విమర్శలు చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని