ఏలూరు ఘటన: ప్రభుత్వం నిజాలు దాస్తోంది

మున్సిపల్‌ నీరు కలుషితం కావటమే ఏలూరులో వింత వ్యాధికి కారణమని వైద్యులు చెబుతున్నారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు  ..

Updated : 09 Dec 2020 14:14 IST

తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల

విజయవాడ: మున్సిపల్‌ నీరు కలుషితం కావటమే ఏలూరులో వింత వ్యాధికి కారణమని వైద్యులు చెబుతున్నారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు  అన్నారు. కొవిడ్‌ వ్యర్థాలను కృష్ణా కాలువలో కలిపేయటమే ఇందుకు ఒక కారణమైతే..  పంపుల చెరువు నీరు తాగటమూ ఈ వ్యాధికి మరో కారణమనే వాదన వినిపిస్తోందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిజాలన్నింటినీ దాస్తూ పంపుల చెరువు వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా ఎందుకు ఆంక్షలు పెట్టిందని ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్లు కావల్సిన వారికి దక్కలేదని రెండు సార్లు రద్దు చేశారని ఆరోపించారు.

‘‘తమ అవినీతి కోసం వైకాపా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే ఏలూరు పరిస్థితే రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. ప్రతిపక్షాలపై దాడులు, కక్షసాధింపులకు చూపే శ్రద్ధ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో లేదు. పది రోజుల క్రితం నుంచే కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నీటిలో తేడా వల్లే వింత వ్యాధని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం నీటి వల్ల కాదని ముందే ప్రకటనలు ఇచ్చింది. బాధితుల సంఖ్య తగ్గించుకునేందుకు రోగులను పరిశీలనలో ఉంచకుండా హడావుడిగా డిశ్ఛార్జి చేస్తున్నారు. విజయవాడ, గుంటూరుల్లో ఉండే అత్యవసర విభాగాలు, ప్రత్యేక వైద్య నిపుణుల బృందాలను ఇంత వరకు ఏలూరులో పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం’’ అని నిమ్మల విమర్శించారు.

జగన్‌ వింత వాదనలకు తెరలేపారు..

రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల పన్ను భారం మోపేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సంస్కరణల పేరుతో కోట్లాది రూపాయలు అప్పుచేస్తూ ఆ భారాన్ని పన్ను రూపంలో ప్రజలపై మోపనున్నారని దుయ్యబట్టారు. పన్నుల రూపంలో వసూలు చేసింది 20శాతం మేర మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేస్తూ 80శాతం జేట్యాక్స్‌ రూపంలో జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టింది వేరు వేరు హామీలంటూ జగన్‌ వింత వాదనలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు పాదయాత్రలో ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పుడు మేనిఫెస్టోలో వేరుందనటం ప్రజల్ని మోసగించటమేనని నిమ్మల ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి..
ఆహారం, నీటి కాలుష్యం వల్లే వింత వ్యాధి!

ఏలూరు పరిసర ప్రాంతాల నీటిలో రసాయనాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని