
తెరాస మాటలు పచ్చి అబద్ధం: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. వివిధ పార్టీల తరఫున ఆయా పార్టీల సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బల్దియా ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. భారీ మెజార్టీతో తెరాసను గెలిపించాలని మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు తదితర సీనియర్ నాయకులు తెరాస తరఫున ప్రచారం చేపడుతుండగా.. కాంగ్రెస్ తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార తెరాసపై నిప్పులు చెరుగుతూ తనదైన శైలిలో ప్రసగిస్తున్నారు.
గత ఆరున్నరేళ్లలో చెయ్యలేనిది, గ్రేటర్‌లో ఈ సారి గెలిపిస్తే చేస్తామని తెరాస చెబుతుండటం పచ్చి అబద్ధమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మన్సురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ. 67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, అదే నిజమైతే మన్సురాబాద్‌లోని పెద్ద చెరువు నుంచి మూసీ నది నాళాను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కబ్జా కోరులకు తెరాస నాయకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వరదసాయం పేరిట ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తే అందులో సగం చోటా నాయకులే తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. మన్సురాబాద్‌లో కట్టిన రెండు పడక గదుల ఇళ్లను స్థానికులకే ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానొక్కడినే పోరాడుతున్నానని.. కనీసం 25 నుంచి 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్‌కు ఇస్తే.. తెరాస మెడలు వంచైనా నగరాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ అన్నారు.
భాజపా, ఎంఐఎం ఇద్దర్నీ కలిపి కొడతాం: కేటీఆర్
మతంపేరిట రాజకీయాలు చేసే వాళ్ల మాయలో ప్రజలు పడొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.70లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే రూ.1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు. తమ డబ్బునే వారణాసి, పట్నాకు తరలిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌లోని గాంధీనగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపా, ఎంఐఎం ఇద్దర్నీ కలిపి కొడతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం 1920లో గండిపేట కట్టారని.. వందేళ్లలో మళ్లీ అలాంటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలు చేయలేదన్నారు. అందుకే కేశవాపూర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామని.. ఏడాదిలో దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వరదలొస్తే కర్ణాటక, గుజరాత్‌కు నిధులిచ్చారని.. హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాస్తే ఉలుకూపలుకూ లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వరదసాయాన్నీ నిలిపేశారని ఆరోపించారు. రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. వరద బాధితుల జాబితా ఇస్తానని.. మోదీని ఒప్పించి రూ.25వేలు ఇప్పించాలని భాజపా నేతలకు కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 4 తర్వాత మిగిలిన బాధితులందరికీ వరదసాయం అందిస్తామని స్పష్టం చేశారు. దిల్లీ నుంచి టూరిస్టులు వస్తారు పోతారని.. తెరాస మాత్రమే పక్కాలోకల్ అని వ్యాఖ్యానించారు.