ఇసుక కొరత, నూతన విధానంపై తెదేపా నిరసన

ఇసుక దోపిడీకి అడ్డుపడుతుందనే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని వైకాపా ప్రభుత్వం అమలు చేయట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ..

Updated : 02 Dec 2020 11:08 IST

అమరావతి: ఇసుక దోపిడీకి అడ్డుపడుతుందనే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని వైకాపా ప్రభుత్వం అమలు చేయట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన ప్రదర్శన చేపట్టారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసు, ఇసుక మూటలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఇసుక తట్టను తలపై పెట్టుకుని పార్టీ నేతలో కలిసి కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్‌ కట్టబెట్టేందుకే నూతన విధానాన్ని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. 

గతంలో ఉచితంగా ఉన్న ఇసుక నేడు భారంగా మారిందని ఈ సందర్భంగా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. కొత్త విధానం ప్రకటించకుండానే తెదేపా అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి.. ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించిందని మండిపడ్డారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. తాము తెచ్చిన ఇసుక విధానం అవినీతి విధానమని ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్‌కి వెళ్లిందని నేతలు ఆరోపించారు. భవన నిర్మాణకార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేయడంతో పాటు రాష్ట్రంలో ఎవ్వరూ ఇళ్లు కట్టుకోలేని దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకుని రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని