చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సహా నాలుగు చట్టాల సవరణ కోసం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. నాలుగు చట్టసవరణ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్టాంపుల చట్టం, జీహెచ్‌ఎంసీ, నాలా చట్టం, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) చట్టాల్లో సవరణ..

Published : 13 Oct 2020 15:24 IST

 

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సహా నాలుగు చట్టసవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్టాంపుల చట్టం, జీహెచ్‌ఎంసీ, నాలా చట్టం, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) చట్టాల్లో సవరణల బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతకుముందు భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47 ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంపు చట్టానికి సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలుగా బదలాయించే ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ధరణి ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు, సీఆర్‌పీసీ చట్టసవరణ బిల్లులను మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం పలువురి సందేహాలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. అనంతరం సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇవే బిల్లులను రేపు శాసనమండలిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో బిల్లుల ఆమోదం అనంతరం సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని