Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ,

Updated : 04 Aug 2021 11:35 IST

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్‌ ఏ నేరానికీ పాల్పడలేదని చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజికవర్గమో తెలియదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్థులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లటంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతోందని.. మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వటం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని