Samajwadi party: సొంత గూటికి చేరుతున్న ఎస్పీ నేతలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.

Published : 29 Aug 2021 15:24 IST

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఇచ్చిన పిలుపునకు వారు స్పందిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసుకునేందుకు పాత నాయకులను ఆయన మళ్లీ ఆహ్వానిస్తున్నారు. దాంతో శనివారం మాజీ మంత్రి అంబికా చౌదరి బీఎస్పీని విడిచిపెట్టి ఎస్పీలో చేరారు. తన కుమారుడు, పెద్ద సంఖ్యలో మద్దతుదారులతో వచ్చేశారు. ఎస్పీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ములాయం, అఖిలేష్‌ల ప్రభుత్వాల్లో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఎస్పీలో చేరారు. తిరిగి ఎస్పీలో చేరుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎమ్మెల్యే సిగ్బహతుల్లా అన్సారీ కూడా తన కుమారుడు, మద్దతుదారులతో కలిసి ఎస్పీలో చేరారు. అన్సారీ కుటుంబం గతంలో ఎస్పీలో ఉండేది. అనంతరం క్వామీ ఏక్తాదళ్‌ పేరిట రాజకీయ పార్టీని స్థాపించుకొంది. 2017 ఎన్నికలకు ముందు దాన్ని ఎస్పీలో విలీనం చేసింది. ఆ తరువాత బీఎస్పీలో చేరింది. మరో సోదరుడు అఫ్జల్‌ అన్సారీ బీఎస్పీ తరపున లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఎస్పీలో చేరేదీ లేనిదీ ఇంకా తెలియరాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని