
ముఫ్తీకి షాక్.. పార్టీకి ముగ్గురు రాజీనామా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి షాక్ తగిలింది. జాతీయ జెండానుద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సోమవారం పార్టీని వీడారు. ఆమె చేతల వల్ల పార్టీలో ఇమడలేకపోతున్నామని, ముఖ్యంగా దేశభక్తి విషయంలో మనోభావాలు దెబ్బతీసేలా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు టీఎస్ బజ్వా, వేద్ మహాజన్, హుస్సేన్ ఏ వప్ఫా ఆమెకు రాజీనామా లేఖలు పంపారు.
ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ ఇటీవల అన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. జాతీయ జెండాను అవమానించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆ పార్టీని ముగ్గురు నేతలు వీడడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.