లోక్‌సభ సమావేశాల్ని బాయ్‌కాట్‌ చేస్తున్నాం: అధిర్‌

వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులతో కొనసాగుతున్న రాజకీయ సెగ లోక్‌సభను తాకింది. రాజ్యసభ నుంచి సస్పెండయిన ఎనిమిది మంది ఎంపీలకు సంఘీభావంగా కొన్ని విపక్షాలు కీలక నిర్ణయం.........

Updated : 29 Feb 2024 18:42 IST

రాజ్యసభలో ఒక్కరోజే ఏడు బిల్లులకు ఆమోదం

దిల్లీ: వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులతో కొనసాగుతున్న రాజకీయ సెగ లోక్‌సభను తాకింది. రాజ్యసభ నుంచి సస్పెండయిన ఎనిమిది మంది ఎంపీలకు సంఘీభావంగా కొన్ని విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లోక్‌సభ కార్యకలాపాలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ప్రకటించారు. రాజ్యసభ నుంచి సస్పెండై దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలకు సంఘీభావంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌ సమావేశాలన్ని బహిష్కరిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, తెరాస సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. అయితే, ఎన్ని రోజుల పాటు సభను బహిష్కరిస్తున్నది మాత్రం అధిర్‌ స్పష్టం చేయలేదు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాజ్యసభలో కార్యకలాపాల గురించి ప్రస్తావించొద్దని సభ్యులను హెచ్చరించారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో సమావేశమై చర్చించారు. సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన విపక్ష పార్టీల నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సమావేశమయ్యారు. 

రేపటితో నిరవధిక వాయిదా పడే అవకాశం?

ఉభయ సభల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేపటితో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. ఎనిమిది రోజుల ముందుగానే పార్లమెంట్‌ సమావేశాలను ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

రాజ్యసభలో ఒక్కరోజే ఏడు బిల్లులకు ఆమోదం
ఇదిలా ఉండగా.. ఈ ఒక్కరోజే రాజ్యసభలో ఏడు బిల్లులకు ఆమోద ముద్రపడింది. ఐఐఐటీ చట్టసవరణ బిల్లు -2020, నిత్యావసర చట్ట సవరణ బిల్లు-2020, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టసవరణ బిల్లు-2020, కంపెనీ చట్ట సవరణ బిల్లు-2020, జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, పన్ను చట్ట సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

లోక్‌సభలో గతంలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. వాటిని విపక్షాలు వ్యతిరేకించాయి. వీటిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఓటింగ్ పెట్టాలని కోరాయి. ఈ క్రమంలో కొందరు సభ్యుల తీరుతో సభలో గందరగోళం నెలకొంది. దీనికి కారణమైన ఎనిమిది మంది విపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ సభ్యులందరూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు