Published : 26/08/2020 18:35 IST

కేంద్రానికి భయపడదామా? పోరాడదామా?

సోనియాతో సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ వ్యాఖ్యలు
నీట్‌, జేఈఈ వాయిదా కోసం ఉమ్మడి పోరాటానికి నిర్ణయం

దిల్లీ: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా జరగనున్న నీట్‌, జేఈఈ పరీక్షల వాయిదా కోసం ఉమ్మడి పోరాటం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏడు రాష్ట్రాల సీఎంలు అభిప్రాయపడ్డారు. భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు సీఎంలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు, జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదాపై చర్చించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడాలో, దాంతో తలపడాలో తేల్చుకోవాలని సూచించారు. కేంద్రంలో భాజపాకు అధికారం కట్టబెట్టిన ఆ ప్రజలే రాష్ట్రాల్లో తమకు అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రాలు ఏదైనా చేస్తే అది పాపం.. కేంద్రం చేస్తే మాత్రం పుణ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. లాక్‌డౌన్‌ నుంచి తమ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందన్న ఉద్ధవ్‌.. పాఠశాలలు మాత్రం ఇప్పట్లో తెరవబోమని స్పష్టంచేశారు. అమెరికాలో పాఠశాలలను తెరిస్తే 97వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని.. అలాంటి పరిస్థితే ఇక్కడా తలెత్తితే ఏం చేస్తామని ప్రశ్నించారు. 

పిల్లలు పరీక్షకు ఎలా కూర్చుంటారో: మమత
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నీట్‌, జేఈఈ పరీక్షలు వాయిదా పడేలా సుప్రీంకోర్టు వెళ్లేందుకు అన్ని రాష్ట్రాలు ఏకం కావాలన్నారు. విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒకవేళ ఈ పరీక్షల వాయిదాపై కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే.. రాష్ట్రాలే వెళ్లాలని వ్యాఖ్యానించారు. కరోనాతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేశంలో రైళ్లు తిరగడంలేదు, వాయు రవాణా సౌకర్యాలూ సజావుగా లేవని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు హాని చేస్తుందని.. విద్యార్థులు ఈ పరీక్షకు ఎలా కూర్చుంటారో అని దీదీ ఆందోళన వ్యక్తంచేశారు. తొలుత ప్రధానిని కలుద్దామని.. ఆయన వినకపోతే అప్పుడు అందరం కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామని మిగతా సీఎంలతో మమతా బెనర్జీ అన్నారు. ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసినా ఇప్పటికీ స్పందన రాలేదన్నారు. 

దీదీ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నా: అమరీందర్‌
కరోనాపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసిందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించడంలేదని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షల వాయిదాపై అందరూ కలిసి ప్రధానిని కలవాలన్న మమత ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. అందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళ్దామని, రివ్యూ పిటిషన్‌ వేద్దామని తెలిపారు. 

ప్రధానినో, రాష్ట్రపతినో కలుద్దాం: హేమంత్‌
సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు ప్రధానినో, రాష్ట్రపతినో కలుద్దామని ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అన్నారు. కేంద్రం గత నాలుగు నెలలుగా జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంతో పరిస్థితి భయంకరంగా ఉందని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ అన్నారు. 

పరీక్షలతో కరోనా కేసులు పెరుగుతాయ్‌: నారాయణస్వామి
ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోనా కేసులు మరింతగా పెరిగేందుకు దారితీస్తాయని పుదుచ్ఛేరి సీఎం నారాయణస్వామి అభిప్రాయపడ్డారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మరోవైపు, ఈ పరీక్షలు వాయిదా వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించే యోచనలో లేనట్టు తెలుస్తోంది. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఎన్‌టీఏ నిన్న తేల్చి చెప్పింది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు 9.53లక్షల మంది విద్యార్థులు; నీట్‌ కోసం 15.97లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్