సోనియా నిర్ణయంపై మన్మోహన్‌ ఏమన్నారు?

నాయకత్వం అంశంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. వర్చువల్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశం........

Published : 24 Aug 2020 16:43 IST

దిల్లీ: నాయకత్వం అంశంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. వర్చువల్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశం తనకు కల్పించాలని సీడబ్ల్యూసీని సోనియాగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అలాగే, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నేతల ముందు ప్రతిపాదన ఉంచగా.. ఆ పదవిలో సోనియానే కొనసాగాలని నేతలు కోరారు. అయితే, అందుకు ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకైనా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ సోనియాను కోరినట్టు సమాచారం. పార్టీ సీనియర్లు రాసిన లేఖపై మన్మోహన్‌ సింగ్‌ స్పందిస్తూ.. అలా లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం బలహీనపడితే పార్టీ కూడా బలహీనపడుతుందని వ్యాఖ్యానించారు. 

లేఖలో విషయాలు క్రూరంగా ఉన్నాయి: ఆంటోనీ

లేఖ రాసిన విషయాన్ని పక్కనబెడితే అందులో పేర్కొన్న అంశాలు క్రూరంగా ఉన్నాయని మరో నేత ఏకే ఆంటోనీ అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ చేసిన త్యాగాల గురించి ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కోరినట్టు తెలుస్తోంది. 

రాహుల్‌ ఆ పదం ఉపయోగించలేదు!: ఆజాద్‌

ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతూ ఇటీవల సోనియాగాంధీకి సీనియర్‌ నేతలు రాసిన లేఖ బయటకు రావడంపై పెద్ద దుమారం రేపింది. ఒకానొక దశలో భాజపాతో కుమ్మక్కై లేఖ రాశారా? అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తే.. నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నట్టు వార్తలొచ్చాయి. అయితే, కొద్దిసేపటి క్రితమే ఆజాద్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ అసలు కుమ్మక్కు అనే మాటే ఉపయోగించలేదని ప్రకటించడం గమనార్హం. 

దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి, యువత దూరమవుతున్న తీరును తదితర అంశాలను లేఖలో ప్రస్తావిస్తూ చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌ సహా మొత్తం 23 మంది నేతలు లేఖలో కోరారు. పార్టీ మరింత ముందుకెళ్లేందుకు పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామక ఆవశ్యకతను లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని