డయ్యర్‌గా మారేందుకు అనుమతి ఎవరిచ్చారు?

పోలీసులు జనరల్‌ డయ్యర్‌ మాదిరిగా మారేందుకు ఎవరు అనుమతిచ్చారో వెల్లడించాలని తేజస్వి కోరారు.

Published : 28 Oct 2020 12:52 IST

ప్రశ్నించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌

పట్నా: బిహార్‌లోని ముంగర్‌లో చోటుచేసుకున్న పోలీసు కాల్పుల ఘటనకు సంబంధించి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విమర్శల దాడి చేశారు. సోమవారం జరిగిన దుర్గాదేవి నిమజ్జనంలో పాల్గొన్న వారిపై అసాంఘిక శక్తులుగా ముద్ర వేసి కాల్పులు జరిపారని ఆయన మండిపడ్డారు. ముంగర్‌ సంఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఆ జిల్లా కలెక్టర్‌, ఎస్సీలను వెంటనే బదిలీ చేయాలని కోరారు. వారికి జనరల్‌ డయ్యర్‌ మాదిరిగా మారేందుకు ఎవరు అనుమతిచ్చారో వెల్లడించాలన్నారు. బిహార్‌లో 71 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ మొదలైన నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

ముంగర్‌లో పోలీసులకు, నిమజ్జనంలో పాల్గొంటున్న వారికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చి కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో 18 ఏళ్ల యువకుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ‘‘బిహార్‌ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? భాజపా నేత అయిన ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ ఏం చేస్తున్నారు?ఈ ప్రభుత్వం రెండు ఇంజిన్లతో నడుస్తోంది. వారికి ఈ ఘటన గురించిన సమాచారం ఇప్పటి వరకు అందలేదా? ఏ చర్య తీసుకోకుండా ఉన్న వారి వ్యవహార శైలి ఈ సంఘటనలో వారి పాత్ర ఉందని స్పష్టం చేస్తోంది’’ అని ముఖ్యమంత్రి అభ్యర్థి యాదవ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని