కొవిడ్‌ యోధులకు అవమానాలా?: రాహుల్‌

పళ్లాలను మోగించి శబ్దాలు చేయటం, దీపాలు వెలిగించటమే మోదీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Published : 18 Sep 2020 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా యోధుల భద్రత, గౌరవాల కంటే పళ్లేలను మోగించి శబ్దాలు చేయటం, దీపాలు వెలిగించటమే మోదీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. శుక్రవారం నాటికి దేశంలో నమోదైన 96,424 కేసులతో దేశంలో మొత్తం కొవిడ్‌ సంఖ్య 52 లక్షలను దాటింది. ఈ పరిస్థితిలో కొవిడ్‌-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో డాక్టర్లు, నర్సులు, సహాయకులు తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది ముందు వరుసలో నిలిచి పోరాడుతున్నారని ఆయన అన్నారు. వారికి ఆ వ్యాధి సోకే ప్రమాదం నిరంతరం పొంచి ఉన్న నేపథ్యంలో, వారిలో ఇప్పటికే కొవిడ్‌-19 సోకిన వారిని గురించిన సమాచారం కేంద్రం వద్ద లేకపోవటం కరోనా యోధులకు అవమానమని అయన ధ్వజమెత్తారు.

తమ సిబ్బందిలో కొవిడ్‌ సోకిన వారికి సంబంధించి జాతీయ స్థాయి సమాచారం అందుబాటులో లేదని.. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ఈ సమాచారంతో కూడిన డేటాబేస్‌ను కేంద్ర స్థాయిలో నిర్వహించటం లేదని ఆయన తెలిపారు. అయితే ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ బీమా పథకంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన సమాచారం, గణాంకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.

ఇందుకు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘‘వ్యతిరేక గణాంకాలే లేని మోదీ ప్రభుత్వం! పళ్లేలను వాయించటం, దీపాలు వెలిగించటం కంటే వారి (వైద్యారోగ్య సిబ్బంది) భద్రత, గౌరవమే ముఖ్యం. మోదీ ప్రభుత్వమా, కరోనా యోధులకు ఎందుకీ అవమానం?’’ అని ట్విటర్‌ మాధ్యమంలో ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని