Published : 17/08/2020 01:28 IST

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను నియంత్రించేది వారే: రాహుల్

సామాజిక మాధ్యమాలపై కాంగ్రెస్‌ నేత తీవ్ర ఆరోపణలు

దిల్లీ: దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌, మెస్సేజింగ్ యాప్‌ వాట్సాప్‌లను భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లు నియంత్రిస్తాయని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా నాయకులు చేసే విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ అంతగా పట్టించుకోదని అమెరికాకు చెందిన ఒక పత్రిక ప్రచురించిన కథనం ఇందుకు ఆధారం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తాయి. వీటి ద్వారా వారు నకిలీ వార్తలు, విద్వేషాన్ని ప్రచారం చేస్తారు. అలానే వీటితో ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తారు. ఫేస్‌బుక్‌ గురించి అమెరికన్ వార్తా సంస్థ ఒక వాస్తవ కథనాన్ని ప్రచురించింది’’ అని ట్వీట్‌కు సదరు వార్తా కథనాన్ని జోడించారు.

‘భారత రాజకీయాలతో ఫేస్‌బుక్‌ విద్వేషపూరిత వ్యాఖ్యల నియమ నిబంధనలు తలపడ్డాయి’ (ఫేస్‌బుక్‌ హేట్-స్పీచ్‌ రూల్స్‌ కొల్లాయిడ్ విత్ ఇండియన్‌ పాలిటిక్స్) అనే పేరుతో ప్రముఖ వార్తా సంస్థ ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అలానే భాజపా కార్యకర్తల పోస్టులపై చర్యలు తీసుకుంటే అవి భారత్‌లో సంస్థ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీస్తాయని ఫేస్‌బుక్‌ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు.

ఓడిన వ్యక్తులే అలా మాట్లాడతారు..

అయితే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ‘‘తమ పార్టీలోని వ్యక్తులను కూడా ప్రభావితం చేయలేని పరాజితులు ప్రపంచం మొత్తం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తున్నాయనే ఆరోపిస్తుంటారు. ఎన్నికలకు ముందు డేటాను ఆయుధంగా ఉపయోగించేందుకు కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, ఫేస్‌బుక్‌తో పొత్తుపెట్టుకున్న మీరు, ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారా’’ అని మంత్రి ట్వీట్ చేశారు. ‘‘సమాచారం, భావ ప్రకటనా స్వేచ్ఛ రెండు ప్రజాస్వామ్యం చేయబడ్డాయి. మీ కుటుంబానికి (కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి) సంబంధించిన వ్యక్తుల చేతుల్లో వాటి నియంత్రణ లేకపోవడం అనేది మీకు బాధ కలిగిస్తోంది. బెంగళూరు అల్లర్లను ఖండిస్తూ మీరు ఇంత వరకు ప్రకటన చేయలేదు. అప్పుడు మీ ధైర్యం ఎక్కడ ఉంది?’’ అని మరో ట్వీట్‌లో రాహుల్ గాంధీని ప్రశ్నించారు.      

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకోసం కొన్ని మిలియన్ యూజర్ల ఫేస్‌బుక్‌ సమాచారాన్ని లండన్‌ కేంద్రంగా పనిచేసే కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా అనే సంస్థ దొంగిలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలానే ఈ సంస్థ 2010 బిహార్ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై  అప్పట్లో భాజపా, కాంగ్రెస్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసున్నాయి.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని