రఘురామకృష్ణరాజుకు ‘వై’ కేటగిరి భద్రత

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ.. నిత్యం వార్తలకెక్కుతున్న నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది...

Updated : 06 Aug 2020 14:31 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ.. నిత్యం వార్తలకెక్కుతున్న నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయన విజ్ఞప్తి మేరకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

 నియోజకవర్గంలో అడుగుపెడితే అంతుచూస్తామని వైకాపా శ్రేణులు బెదిరిస్తున్నారని ఇటీవల రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉందని, లోక్‌సభ సభ్యుడిగా నియోజకవర్గానికి వెళ్లి ప్రజాసమస్యలు పరిష్కరించలేని పరిస్థితి నెలకొందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులతో 1+1 భద్రత కల్పిస్తున్నారని, ఇకపై కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. వైకాపా నేతల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో కూడా సమావేశమై తన భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వైకాపా శ్రేణుల నుంచి తనకు ముప్పు ఉందని, ప్రభుత్వం తనకు భద్రత కల్పించిన తర్వాతే నియోజకవర్గానికి వెళతానని గత కొన్ని రోజులుగా దిల్లీలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రత కల్పించింది. ఈమేరకు ఏపీ డీజీపీ, సీఆర్పీఎఫ్‌ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తనకు కేంద్రం భద్రత కల్పించడంతో ఏపీ రాజధాని కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను త్వరలో కలుస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయం చెప్పేందుకు సీఎం జగన్‌ తనకు సమయం ఇవ్వరని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని