
కేంద్ర వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు
దిల్లీ: రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏపీలో రైతు భరోసా పథకం ద్వారా సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు.
‘‘రాత్రింబవళ్లు కష్టపడి పంటలు పండించిన రైతులు ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొదటిది రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదు. రెండోది రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఈ బిల్లు ద్వారా ముందుగా నిర్ణయించుకున్న ధరకు రైతులు పంట అమ్ముకునే వీలుంది. వ్యవసాయ మార్కెట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. మధ్య వర్తుల వల్ల రైతులు నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర వచ్చిన చోట పంట విక్రయం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
బిల్లుపై స్పష్టత ఇవ్వాలి: తెదేపా
వ్యవసాయ బిల్లుపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. బిల్లుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సర్కారు విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.