Rahul Gandhi: ఆ విషయంలో మోదీ పాలన ఒక కేస్‌ స్టడీ.. రాహుల్‌ గాంధీ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన మొదలైన వేళ.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆయన పాలనపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగం తదితర అంశాలను ఉటంకిస్తూ.. ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా...

Published : 02 May 2022 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన మొదలైన వేళ.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆయన పాలనపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగం తదితర అంశాలను ఉటంకిస్తూ.. ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనేదానిపై ప్రధాని మోదీ పాలన ఒక కేస్ స్టడీ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘విద్యుత్‌ సంక్షోభం.. నిరుద్యోగం.. రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం.. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల తప్పుడు పాలన ఒక కేస్ స్టడీ’ అని విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలను విద్యుత్‌ సంక్షోభం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాలు ఇప్పటికే కరెంటు కోతలు మొదలుపెట్టాయి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై రాహుల్ గాంధీ ఇటీవల స్పందిస్తూ.. ఈ విద్యుత్‌ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? లేదా ప్రజలనేనా?’ అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ వాగ్దానాలు, ఉద్దేశాల మధ్య అసలు సంబంధం లేదని ఆరోపించారు. అంతకుముందు.. విద్వేషపు బుల్డోజర్లు నడపడం ఆపి, విద్యుత్‌ కర్మాగారాలు పనిచేసేలా చూడాలని హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని