Nagaland: మంత్రితో రాజు పోటీ.. మధ్యలో ఇంజినీర్‌: ఆసక్తికరంగా టిజిత్‌ పోరు

నాగాలాండ్‌ (Nagaland)లోని టిజిత్‌ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఓ రాజు మంత్రిపై పోటీ చేస్తుండగా మధ్యలో ఇంజినీర్‌ కూడా బరిలోకి దిగారు. ఇంతకీ వారు ఎవరు? ఈ పోటీ ఎందుకంత ప్రత్యేకం?

Published : 21 Feb 2023 16:29 IST

కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ (Nagaland)లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టిజిత్‌ నియోజకవర్గం ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఓ రాజు, మంత్రి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరి మధ్యలోకి ఓ ఇంజినీర్ కూడా రావడంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది.

2021 డిసెంబరులో నాగాలాండ్‌ (Nagaland)లో భీకర కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులుగా పొరబడి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన ఆటింగ్‌ అనే గ్రామం టిజిత్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని ‘అంఘ్‌’ తెగ అధినాయకుడు (రాజు) తవాంగ్‌.. కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (NPF) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: నాగా నేలలో పాగా ఎవరిదో..?

ఇదే స్థానం నుంచి ఎన్‌డీపీపీ (NDPP)-భాజపా (BJP) సంకీర్ణ ప్రభుత్వం తరఫున భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి. పైవంగ్‌ కోన్యాక్ మరోసారి బరిలోకి దిగారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. దీంతో రాష్ట్ర మంత్రిని రాజు ఢీకొడుతున్నట్లైంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థిగా టి. థామస్‌ కోన్యాక్‌ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన థామస్‌.. ఈ ఎన్నికలతో రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా తవాంగ్‌ అంఘ్‌ మాట్లాడుతూ.. ‘‘సంప్రదాయంగా వచ్చిన నాయకత్వ బాధ్యతల్లో ఉన్నప్పటికీ నా శక్తికి మించి ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నా. ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వ అండ కావాలి. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని తెలిపారు. తవాంగ్ తండ్రి, సోదరుడు కూడా గతంలో పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భాజపా, ఎన్‌పీఎఫ్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టడంతో టిజిత్‌ నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

2021 డిసెంబరు 4న బొగ్గు గనిలో పనికి వెళ్లి తిరిగివస్తున్న కూలీలను తిరుగుబాటుదారులుగా పొరబడి భద్రతాబలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు భద్రతా బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. దీంతో ఆత్మరక్షణ కోసం సిబ్బంది మళ్లీ కాల్పులు జరపడంతో.. ఏడుగురు స్థానికులు మృత్యువాతపడ్డారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని