Chandrababu: ప్రజలకు.. నాకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో అడుగుపెట్టారు.

Updated : 15 Jun 2024 19:16 IST

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఇకపై ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలను సైతం తరచూ సందర్శించాలని మంత్రులు, నేతలను ఇదివరకే చంద్రబాబు ఆదేశించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘‘నాకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటాం. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. పోలవరం సందర్శనతోనే నా క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తాం. విధ్వంస పాలనకు గుర్తుగా ప్రజావేదికను అలాగే ఉంచుతాం.. శిథిలాలు తొలగించం’’ అని చంద్రబాబు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని