Aaditya Thackeray: ‘ఈ ద్రోహాన్ని మర్చిపోలేం.. ఇది నిజం, అబద్ధం మధ్య పోరు’

రెబల్‌ అభ్యర్థులపై ఆదిత్య ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది నిజం, అబద్ధం మధ్య సాగుతోన్న పోరు అని.. ఈ ద్రోహాన్ని మర్చిపోలేనని పేర్కొన్నారు........

Published : 25 Jun 2022 19:44 IST

ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) వర్గం తిరుగుబాటు చేయడంతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలోనే మంత్రి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) రెబల్‌ అభ్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది నిజం, అబద్ధం మధ్య సాగుతోన్న పోరు అని.. ఈ ద్రోహాన్ని మర్చిపోలేనని పేర్కొన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్‌ ఎమ్మెల్యేలు చేసిన ఈ ద్రోహాన్ని మర్చిపోలేము. తిరుగుబాటుదారులను సహించేది లేదు. ఇది నిజం, అబద్ధం మధ్య సాగుతున్న సమరం. కచ్చితంగా శివసేననే గెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. అసమ్మతి నేతలు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఉపయోగించకుండా ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా దానికి ఆమోదం లభించింది. దీంతో బాలాసాహెబ్, శివసేన పేర్లను ఏ వర్గం ఉపయోగించకుండా చూడాలంటూ ఉద్ధవ్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఏక్‌నాథ్‌ శిందే వర్గం కొత్త పార్టీ స్థాపించనుందని, దానికి ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ అని పేరు పెట్టనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం ఈసీని ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని