AAP: వినూత్న ప్రయోగానికి విశేష ఆదరణ.. 24గంటల్లో 8లక్షల స్పందనలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ తెరలేపిన వినూత్న ప్రయోగానికి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే 8లక్షల మంది స్పందించి సీఎంగా ఎవరు కావాలో తమ అభిప్రాయం తెలియజేశారు.......

Published : 16 Jan 2022 03:28 IST

దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌).. సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం కొత్త ఒరవడికి తెరతీసిన విషయం తెలిసిందే. 7074870748కి కాల్‌/మేసేజ్‌/వాట్సాప్ చేసి నచ్చిన అభ్యర్థిని ఎంచుకోమని తెలుపగా.. దీనికి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే 8లక్షల మంది స్పందించి సీఎంగా ఎవరు కావాలో తమ అభిప్రాయం తెలియజేశారు. ‘పంజాబ్‌లో తమ సీఎం అభ్యర్థిని సూచిస్తూ.. 24 గంటల్లోనే 8లక్షలకు పైగా ప్రజలు స్పందించారు. తమ విలువైన అభిప్రాయాన్ని తెలియజేశారు’ అని ఆప్‌ సీనియర్‌ నాయకుడు, ప్రతిపక్ష నేత హర్పాల్‌ సింగ్‌ చీమా వెల్లడించారు.

గడిచిన 24 గంటల్లో 4లక్షలకు పైగా ఫోన్‌ కాల్స్‌, 3లక్షలకు పైగా వాట్సాప్‌ మెసేజ్‌లు, 50వేల టెక్ట్స్‌ మెసేజ్‌లతోపాటు లక్షలకు పైగా వాయిస్‌ మెసేజ్‌లు వచ్చినట్లు తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5గంటల వరకు వచ్చే సందేశాలు, కాల్స్‌ తర్వాత అన్నింటిని విశ్లేషించి అత్యధిక ఓట్లు వచ్చిన వారిని తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం రాబోతోందని హర్పాల్‌సింగ్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు మెచ్చిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని వెల్లడించిన పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఈ ప్రక్రియకు తెరలేపారు. ‘మూడు కోట్ల పంజాబ్ ప్రజలకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను వదిలేశాం. వారు జనవరి 17 సాయంత్రం ఐదు గంటలలోపు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని గుర్తించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించడం ఇదే మొదటిసారి’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ఆప్‌ సీఎం అభ్యర్థులుగా భగవంత్‌ మన్, రైతు నేత నుంచి రాజకీయ నేతగా మారిన బల్బీర్ సింగ్ రాజేవాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని