Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్‌ఆద్మీ’ సక్సెస్‌.. ఎందుకంటే..!

దిల్లీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలు.. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నవారికంటే ఉత్తమ విద్య పొందుతున్నారని, దీన్నిబట్టి ఆప్‌ రాజకీయ ప్రవేశం విజయవంతమైందని ఆ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీలోని జనక్‌పురిలో డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ స్పెషలైజ్డ్‌ ఎక్స్‌లెన్స్‌ పాఠశాలను ఆయన ప్రారంభించారు.

Published : 03 Feb 2023 02:24 IST

దిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) రాజకీయ ప్రవేశం విజయవంతమైందని ఆ పార్టీ అధినేత, దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలు.. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నవారికంటే ఉత్తమ విద్య పొందుతుండటమే ఇందుకు సంకేతమని అన్నారు. పశ్చిమ దిల్లీలోని జనక్‌పురిలో డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ స్పెషలైజ్డ్‌ ఎక్స్‌లెన్స్‌ పాఠశాల (SoSE)ను ప్రారంభించి ఆయన.. దిల్లీ స్కూళ్లలో మెరుగుపడిన సదుపాయాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

‘గతంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపిచేందుకు నిరాకరించేవారు. అయితే, ఇక్కడి ప్రభుత్వ బడుల్లో వచ్చిన మార్పు దేశానికే ఒక బెంచ్‌మార్క్‌. మౌలిక సదుపాయాలు, బోధనలో ప్రైవేటు కంటే ఇవే ఉత్తమం. నేనూ హరియాణాలోని ఓ పేరున్న ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నా. నా పిల్లలు కూడా నోయిడాలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. కానీ, ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వ పాఠశాలలు వాటికంటే ఎంతో ఉత్తమమైనవి’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దీన్నిబట్టి ‘ఆమ్ఆద్మీ’ రాజకీయాల్లో విజయవంతమైందని స్పష్టంగా చెప్పగలనన్నారు.

స్పెషలైజ్డ్‌ ఎక్సెలెన్స్‌ స్కూళ్ల ద్వారా ఐదు విభాగాల్లో ప్రత్యేక విద్యను అందిస్తున్నామన్న ఆయన.. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, హ్యూమానిటీస్‌, ఐటీ, కృత్రిమ మేధ వంటి నైపుణ్యాలపై ఈ పాఠశాలలు దృష్టి పెడతాయన్నారు. ఇప్పటికే 31 స్పెషలైజ్డ్‌ ఎక్సెలెన్స్‌ స్కూళ్లు ఉన్నాయని, 2022-23 విద్యాసంవత్సరం నాటికి ఈ సంఖ్యను 44కు చేర్చనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో మొత్తం 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని