Manish Tewari: ఆప్‌ పిలిచింది.. మా వాళ్లే అప్పట్లో పిలవలేదు: సొంత పార్టీపై కాంగ్రెస్‌ ఎంపీ విసుర్లు

ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ ధన్యవాదాలు తెలిపారు.

Updated : 17 Mar 2022 01:38 IST

కాంగ్రెస్‌ పార్టీకి మనీశ్‌ తివారీ మరోసారి చురకలు

దిల్లీ: వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ పంజాబ్‌ కాంగ్రెస్‌ తీరును ఎండగడుతూ మరోసారి చురకలంటించారు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల మనీశ్‌ తివారీ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని చెప్పిన ఆయన.. గతేడాది తమ పార్టీ నేత సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని సొంతపార్టీకే చురకలంటించారు.

‘పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా హాజరు కాలేకపోతున్నా. మా ఎమ్మెల్యేలలో ఒకరైనప్పటికీ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మాత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు నన్ను ఆహ్వానించక పోవడం విడ్డూరం’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీ పంపిన ఆహ్వాన లేఖను జతచేస్తూ ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌కు చెందిన మనీశ్‌ తివారీ కాంగ్రెస్‌ రెబల్‌ (జీ-23) నేతల్లో ఒకరు. పలు అంశాలపై పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇటీవల పంజాబ్‌లో చోటుచేసుకున్న పార్టీ అంతర్గత కుమ్ములాటలను ఆయన తీవ్రంగా విమర్శించారు. దీంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను ప్రచారానికి దూరం పెట్టింది. ఇక తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎంపీకి ఆహ్వానం పంపింది. కానీ, పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని