Kejriwal: దక్షిణాదిపై కేజ్రీవాల్‌ దృష్టి.. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర..?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎ

Updated : 18 Mar 2022 17:29 IST

దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తోంది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలంగాణను వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే నెలలో కేజ్రీవాల్‌ హైదరాబాద్‌కు రానున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల మద్దతు ఆప్‌కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆప్‌ తెలంగాణ సెర్చ్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్‌ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. 

తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్‌ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా సోమనాథ్‌ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  

ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 92 చోట్ల జయఖేతనం ఎగురవేసింది. భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని