
Punjab Election 2022: ఆమ్ ఆద్మీ ‘మస్త్ కలందర్’.. జబర్దస్త్ వీడియో చూశారా..!
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిని పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఎంపీ భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆప్ సోషల్ మీడియా విభాగం ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పంచుకోగా.. అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సీఎం అభ్యర్థిని వెల్లడించేందుకు ఆప్.. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ ‘హే బేబీ’ సినిమాలోని ‘మస్త్ కలందర్’ పాటను ఎంచుకుంది. ఇందులో నటించిన షారుక్ ఖాన్‌ను భగవంత్ మాన్‌తో పోల్చారు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్‌లను చరణ్‌జిత్ చన్నీ, నవజ్యోత్‌సింగ్ సిద్ధూగా.. విద్యాబాలన్‌ను సీఎం కుర్చీగా పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూ సీఎం కుర్చీ కోసం ప్రయత్నిస్తుంటే.. షారుక్ రూపంలో భగవంత్ మాన్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు. దీంతో అక్కడేఉన్న రాహుల్ గాంధీ తెల్లముఖం వేయగా.. అరవింద్ కేజ్రీవాల్ సంబురాలు చేసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 485వేల మంది వీక్షించారు. దాదాపు ఎనిమిది వేల మంది లైక్ చేశారు.
పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలతో టెలీఓటింగ్ నిర్వహించింది. ఇందులో 93శాతం మంది భగవంత్ మాన్నే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 21.59లక్షల స్పందనలు వచ్చినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో 93.3శాతం మంది భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఈ స్పందన చూస్తుంటే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తప్పకుండా విజయం సాధిస్తుందని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే పంజాబ్ తదుపరి సీఎం అవుతారు’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.