AAP: కర్ణాటకపై ఆప్‌ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్‌!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly polls)పై గురిపెట్టిన ఆప్‌(AAP).. 224 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత అతిషీ వెల్లడించారు. మార్చి తొలి వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని తెలిపారు. 

Published : 01 Feb 2023 01:50 IST

బెంగళూరు: పంజాబ్‌లో అపూర్వ విజయం, ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లతో జాతీయ పార్టీ హోదా సాధించిన ఉత్సాహంలో ఉన్న ఆప్(AAP).. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly polls)పై దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు బెంగళూరు(Bengaluru)లో పర్యటిస్తూ గెలుపే లక్ష్యంగా అజెండా రూపకల్పన చేస్తున్నారు. మరో మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌(AAP) మొత్తం 224 సీట్లలో పోటీ చేస్తుందని ఆప్‌ నేత అతిషీ(Atishi) వెల్లడించారు. మంగళవారం ఆమె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ అధికార భాజపా, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఇస్తోన్న హామీలపై ఆమె విమర్శలు గుప్పించారు. దిల్లీలో తాము ఇప్పటికే అమలుచేస్తోన్న హామీలనే ఆ పార్టీలు కాపీ కొడుతూ ప్రజలకు అందిస్తామని హామీలు ఇస్తున్నాయన్నారు.

మరి.. ఇన్నాళ్లేం చేశారు?

దిల్లీలో ఆప్‌ సర్కార్‌ అమలు చేస్తోన్న పథకాల తరహాలోనే భాజపా నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామంటోందని.. అలాగే, కాంగ్రెస్‌ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని హామీ ఇస్తోందన్నారు. వీటన్నింటినీ ఆప్‌ ఇప్పటికే దిల్లీలో అమలు చేస్తోందన్నారు. కర్ణాటకలో తమ పార్టీ 224 స్థానాల్లో పోటీ చేయనుండటంతో క్షేత్రస్థాయిలో మంచి స్పందన వస్తోందన్నారు. అభ్యర్థుల జాబితాను మార్చి తొలి వారంలో ప్రకటించనున్నట్టు అతిషీ వెల్లడించారు. గత మూడున్నరేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భాజపా ప్రభుత్వం దిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశం ఉంటే మరి ఇన్నేళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వ గడువు ముగుస్తున్న సమయంలో రాష్ట్రంలో వివేకా పథకం కింద 24వేల తరగతి గదులు నిర్మిస్తామని హామీ ఇవ్వడంపైనా ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు చేసే అవకాశం ఉన్నా ఎందుకు తరగతి గదులు నిర్మించలేదని నిలదీశారు. 

ఆ రాష్ట్రాల్లో అమలుచేసి అప్పుడు చెప్పండి!

అలాగే, అధికారంలోకి వస్తే ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రకటిస్తోన్న హామీపైనా విమర్శలు అతిషీ విరుచుకుపడ్డారు. ఇలాంటి హామీలు ప్రజలు నమ్మరని.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఈ పథకాన్ని అమలు చేస్తేనే కర్ణాటక ప్రజల ఇలాంటి మాటల్ని విశ్వసిస్తారన్నారు. మరోవైపు, జేడీఎస్‌ కూడా నాణ్యమైన విద్య అందించడంగురించి ఇప్పుడు మాట్లాడుతోందని ఆక్షేపించారు. అవినీతితో విసిగి వేసారిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అజెండాను సెట్‌ చేస్తున్నట్టు చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించగలమని ఇప్పటికే ఆప్‌ రుజువు చేసి చూపించిందని.. అందుకే ప్రజలు తమ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారన్నారు. నిజాయితీతో హామీలను అమలు చేసే పార్టీనే ఎన్నుకోవాలని ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని