AAP: జాతీయ రాజకీయాల వైపు ఆప్ అడుగులు.. రాజకీయం ఎలా ఉండబోతోంది?
AAP: జాతీయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న ఆప్ కల సాకారం అయ్యేనా.? ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. లాభమెవరికి? నష్టం ఎవరికి?
‘‘పంజాబ్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆప్ రూపంలో ప్రజలకు ప్రత్యామ్నాయం దొరికింది. ఆప్ హోరులో అమరీందర్, చన్నీ, సిద్ధూ, సుఖ్‌బీర్‌సింగ్, ప్రకాశ్‌సింగ్, బిక్రమ్‌సింగ్ కొట్టుకుపోయారు. ఆప్‌ను దేశమంతా విస్తరిస్తాం’’ - ఇవీ పంజాబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తామంటూ ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఇవేవో గెలుపు ఉత్సాహంతోనో, ఉజ్జాయింపుగా చేసిన వాఖ్యలనో తేలిగ్గా తీసుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఆప్ అడుగులను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఓ ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై.. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు చోట్ల (దిల్లీ, పంజాబ్) అధికారంలోకి రావడం అంటే సాధారణ విషయం కాదు. కాంగ్రెస్, భాజపా, కమ్యూనిస్టు పార్టీలకు తప్ప ఏ జాతీయ పార్టీకి గానీ, ఏ ప్రాంతీయ పార్టీకి గానీ ఈ ఫీట్ సాధ్యం కాలేదు. అయితే, జాతీయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న ఆప్ కల సాకారం అయ్యేనా.? ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. లాభమెవరికి? నష్టం ఎవరికి?
అన్నా హజారే లోక్‌పాల్ డిమాండ్ నుంచి పుట్టికొచ్చిన పార్టీ.. ఆమ్ ఆద్మీ. పార్టీ ఏర్పాటైన తొలి ఏడాదికే 2013లో తొలిసారి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. భాజపా తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిరోజులకే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో దిల్లీ కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. మళ్లీ రెండేళ్లకే జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఈ సారి ఆప్ దిల్లీలో అడుగు పెట్టింది. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పంజాబ్‌లో నాలుగుస్థానాలు దక్కించుకుంది. ఇలా పార్టీ పుట్టిన రెండేళ్లకే రెండు చోట్ల తనదైన ముద్రవేసింది.
అన్ని రాష్ట్రాల్లో అడుగులు.. చేదు గుళికలు
2015లో దిల్లీలో అధికారంలోకి వచ్చిన ఊపుతో పార్టీ విస్తరించాలని ఆప్ అప్పుడే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 20 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. గోవా ఎన్నికల్లో ఒక్క స్థానమూ గెలుచుకోనప్పటికీ 6.3 శాతం ఓట్లు సాధించింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ.. ఇలా అనేక రాష్ట్రాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క శాతం ఓటింగ్ కూడా తెచ్చుకోలేకపోయింది. 2019 సార్వాత్రిక ఎన్నికల్లో 35 స్థానాల్లో పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం (భగవంత్ మాన్) మినహా మిగిలిన అన్నిచోట్లా ఓటమే ఎదురైంది. ఆప్ ఇలా తన జాతీయ ఆకాంక్షలను గతంలోనే బయటపెట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకుండా ఎన్నికలకు వెళితే చేదు గుళికలే మిగులతాయని తర్వాత అర్థం చేసుకుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క మణిపుర్ మినహా మిగిలి నాలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు సిసోడియాకు ఉత్తరాఖండ్, రాఘవ్ చద్దా, అతిషిని పంజాబ్‌కు ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. గోవా బాధ్యతలనూ అతిషికి అప్పగించారు. ప్రస్తుత ఫలితాల్లో పంజాబ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించగా.. గోవాలోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది.
జాతీయ పార్టీగా అవతరించాలంటే..?
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయ లక్ష్యాలు నెరవేరాలంటే జాతీయ పార్టీగా అవతరించడం ముఖ్యం. ఒకవేళ జాతీయ పార్టీగా అవతరిస్తే ఎన్నికల్లో ఒకే గుర్తుతో దేశవ్యాప్తంగా పోటీ చేయడానికి వీలుంటుంది. అయితే, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధిస్తే అప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ సత్తా చాటితే ఆప్ ‘జాతీయ’ లక్ష్యాలు నెరవేరినట్లే!
ఫక్తు రాజకీయ పార్టీగా..
అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించిందనడంలో సందేహం లేదు. ఆ పార్టీలోనూ వ్యక్తి పూజ ప్రారంభమైంది. ప్రకటనల్లోనూ కేజ్రీవాలే ప్రధానంగా కనిపించేవారు. ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. కేజ్రీవాల్ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటివారూ పార్టీ నుంచి బయటకొచ్చారు. లోక్‌పాల్ బిల్లుపై పుట్టుకొచ్చిన ఆ పార్టీ.. దిల్లీలో ఇంతవరకు దాన్ని తీసుకురాలేదు. హనుమాన్ ఆలయాల సందర్శన పేరుతో కేజ్రీవాల్ సైతం సాఫ్ట్ హిందుత్వ రాజకీయాలు నెరిపారు. అయితే, దిల్లీలో విద్య, వైద్యం, పార్కుల అభివృద్ధి, ఉచిత విద్యుత్ వంటి ప్రజాకర్షక పథకాలు మిగిలిన పార్టీలకు ఆప్ భిన్నమని నిరూపించాయి. సగటు మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను ఆ పార్టీ తీర్చింది. ఆ పార్టీని దిల్లీలో రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఈ అంశాలే దోహదపడ్డాయి. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటూ ఆప్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది.
హస్తానికే దెబ్బ..
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే మొదట నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. మరోవైపు భాజపాయేతర, కాంగ్రేసేతర విపక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ప్రయత్నిస్తున్నారు. రేప్పొద్దున ఆప్ కూడా ప్రత్యామ్నాయ వేదికగా అవతరిస్తే హస్తం పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్ సాయం లేకుండా ప్రత్నామ్నాయం ఏర్పాటు సాధ్యం కాదని మరికొంతమంది విశ్లేషకులు చెప్పేమాట. అలాంటి ప్రయత్నం జరిగినా అది తిరిగి భాజపాకే లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ ఏడాది చివర్లో జరగబోయే రెండు రాష్ట్రాల్లో ఆప్ సత్తా చాటితే జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ కీలకంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final- Gill: వివాదాస్పద క్యాచ్‌పై శుభ్‌మన్ గిల్ సెటైరికల్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
-
Movies News
social look: ప్రణీత పంచ్‌లు.. సమంత చిరునవ్వులు...
-
Politics News
Sharad Pawar: ప్రత్యామ్నాయం మేమేనని నిరూపించుకోవాలి: శరద్ పవార్
-
World News
Ukraine: ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభం.. బఖ్‌ముత్‌లో ముందుకు
-
Movies News
Rajinikanth: మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తోన్న స్నేహితులు
-
Politics News
Pankaja munde: మధ్యప్రదేశ్‌లో మళ్లీ మాదే అధికారం: పంకజ ముండే