TMC: తృణమూల్‌ నూతన జాతీయ కార్యవర్గం.. మళ్లీ అదే పదవిలోకి అభిషేక్‌ బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తిరిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

Updated : 19 Feb 2022 04:34 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తిరిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నూతన కమిటీలో పార్టీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హాకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఆయనతోపాటు సుబ్రతా భక్షి, చంద్రిమా భట్టాచార్య కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయయ్యారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అరూప్‌ విశ్వాస్‌ ట్రెజరర్‌గా వ్యవహరించనుండగా.. కోల్‌కతా మేయర్‌ ఫిర్హద్‌ హకీమ్‌ సమన్వయ కమిటీకి ఇన్‌ఛార్జిగా ఉంటారు.

గతేడాది శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం అనంతరం అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో ప్రాభవం పెరిగింది. దీంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత నియమించారు. అయితే, పార్టీలోని పెద్దలకు, నూతన తరానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. పార్టీలోని సీనియర్లు పార్టీ, ప్రభుత్వంలో ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తుండడంపై అభిషేక్‌ బెనర్జీ మద్దతున్న కొత్త తరం నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఈ విషయం మరింత ముదరకముందే జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీని ఇటీవల మమత రద్దు చేశారు.

కొత్త కమిటీ ఎంపిక కోసం 20 మందితో నూతన వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు అమిత్‌ మిత్రా, పార్థా ఛటర్జీ, సుబ్రతా బక్షీ, సుదీప్‌ బందోపాధ్యాయ, అభిషేక్‌ బెనర్జీ, అనుబ్రత మొండల్‌, అరూప్‌ బిశ్వాస్‌, ఫిర్హాద్‌ హకీమ్‌, యశ్వంత్‌ సిన్హా తదితరులకు కొత్త కార్యనిర్వాహక కమిటీలో నియమించారు. మమత తీసుకున్న తాజా నిర్ణయంతో పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేది తానేనని, పార్టీపై నియంత్రణాధికారం తనదేనని చాటుకున్నారు. అలాగే, అభిషేకే వారసుడని తెలియజెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని