Shiv sena: బాంబే హైకోర్టులో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట!

ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. తూర్పు అంధేరి నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేశ్‌ లాఠ్కే భార్య రుతుజ లాఠ్కే  రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 14 Oct 2022 00:02 IST

ముంబయి: శివసేన పార్టీ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది.  ఇటీవల మృతి చెందిన తూర్పు అంధేరి నియోజవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేశ్‌ లాఠ్కే భార్య రుతుజ లాఠ్కే తన ఉద్యోగానికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. శివసేన రెండు వర్గాలుగా చీలిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. రమేశ్‌ లాఠ్కే మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉద్ధవ్‌ వర్గం నుంచి రుతుజ లాఠ్కేను బరిలోకి దించుతున్నారు. ఆమె బృహాన్‌ ముంబయి మున్సిపాలిటీలో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని కారణంగా.. సెప్టెంబరు 2వ తేదీనే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, పైఅధికారులు దాన్ని ఆమోదించలేదు. నామినేషన్‌ దాఖలు చేయడానికి శుక్రవారమే చివరి రోజు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగి రాజీనామా చేసిన నెలలోపు నిర్ణయం తీసుకోవచ్చని బీఎంసీ కమిషనర్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ‘‘ ఒక ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలో తప్పేముంది? ఆమె ఓ క్లర్కు. ఇది సంస్థకు, ఉద్యోగికి మధ్య ఉన్న చిన్న అంశం మాత్రమే. దీన్ని ఎక్కువ రోజులు వాయిదా వేయొద్దు. శుక్రవారం ఉదయం 11గంటల లోగా ఆమె రాజీనామాను ఆమోదించండి’’ అని కోర్టు ఆదేశించింది.

మరోవైపు, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గంగానీ, భాజపా గానీ పోటీ చేయడం లేదు. కానీ, ఇటీవల పార్టీ పేరు, గుర్తు కేటాయింపులపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని ఠాక్రే వర్గం కోరింది. శిందే వర్గం కూడా త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడుతోపాటు గద గుర్తులను సమర్పించింది. శిందే వర్గం ప్రతిపాదించిన త్రిశూలం, గద మతపరమైన చిహ్నాలను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని కేటాయించడానికి నిరాకరించింది. ఉదయిస్తున్న సూర్యుడు గుర్తు ఇప్పటికే డీఎంకేకు ఉన్నందున దాన్ని కూడా తిరస్కరించింది. చివరికి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ‘శివసేన ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే’ పార్టీతో పాటు ‘కాగడా’ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం..శిందే వర్గానికి ‘బాలాసాహెబంచి శివసేన’ పేరు, రెండు కత్తులు, డాలు ఉన్న గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని