Actor ali: పవన్‌కల్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధమే: అలీ

Actor ali: రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే, పవన్‌కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని నటుడు అలీ అన్నారు.

Updated : 17 Jan 2023 17:41 IST

నగరి: సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Ali) అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2024 ఎన్నికల్లో వైకాపా 175 సీట్లలో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నాకు మంచి మిత్రుడు. అయితే, సినిమాలు, రాజకీయం రెండూ వేరు. పార్టీ ఆదేశిస్తే, పవన్‌పై పోటీచేయడానికి సిద్ధం. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి నేను రెడీగా ఉన్నా. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో వైసీపీ విజయం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు? ఎవరు మంచి పథకాలు ఇస్తున్నారు? అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. మంచి చేసే వారినే ప్రజలు ఎన్నుకుంటారు. జగన్‌ మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణం. కొందరు విమర్శించిన సమయంలో తిరిగి విమర్శించడం అవసరం. పవన్‌ కల్యాణ్ రోజాను డైమండ్‌ రాణి అని విమర్శించారు. రోజమ్మ నిజంగానే కోహినూర్‌ డైమండ్‌తో సమానం’’ అని అలీ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని