ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌.. అధీర్‌ రంజన్‌ రాజీనామా

బహరంపుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలుపొందిన అధీర్‌.. ఇటీవల ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో ఓడిపోయారు.

Updated : 21 Jun 2024 19:11 IST

కోల్‌కతా: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పలు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధీర్‌ రంజన్‌ ఛౌదరి తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ పేలవమైన పనితీరుకు గల కారణాలపై పీసీసీ సమావేశంలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధీర్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ఆమోదంపై పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

బహరంపుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలుపొందిన అధీర్‌.. ఇటీవల ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన.. బెంగాల్‌లో ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. ఇలా ఆయన తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్‌-కాంగ్రెస్‌ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమయ్యిందనే వాదన ఉంది. చివరకు రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ పరిమితమైంది. దీంతో మాల్దా-దక్షిణ్‌ నుంచి గెలుపొందిన ఇషాఖాన్‌ చౌధరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని