‘పరిటాల రవి మాదిరిగా చంపేస్తారేమోనని నా భార్య భయపడుతోంది’: ఆదినారాయణరెడ్డి

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందనేందుకు అమరావతి అంశమే నిదర్శనమని భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. అమరావతి ఉద్యమం 800వ రోజుకు

Published : 25 Feb 2022 01:30 IST

అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందనేందుకు అమరావతి అంశమే నిదర్శనమని భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. అమరావతి ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా రైతులకు మద్దతుగా ఆయన మాట్లాడారు. విశాఖలో సీఎం జగన్‌కు భూములు ఉన్నాయని అందుకే అక్కడ రాజధాని అంటున్నారని ఆరోపించారు. జగన్‌ అధికారంలోకి వస్తే రాజధాని విశాఖకు మారుస్తారని గతంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందన్నారు.

‘‘రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విశాఖలో భూములు కొన్నారు. ఆ భూములకు మంచి ధర రావాలంటే రాజధాని అక్కడ పెట్టాలని జగన్‌ ఆలోచన. ఇలాంటి దొంగ వ్యక్తి ఉంటే రాష్ట్రానికి మంచి జరగదు. మంచి చేయమంటే చెడు చేస్తారు.. చెడు చేయమంటే మంచి చేస్తారు. సొంత బాబాయిని చంపి, వాళ్లే కడిగి, కుట్లు కూడా వేశారు. వారి సొంత టీవీ ఛానెల్‌లో గుండె పోటు అని ప్రచారం... ఆ తర్వాత గుండెల్లో పోటు అని మార్చారు. వివేకా కేసులో నాపైన, చంద్రబాబుపైన మొదట నిందలేశారు. ఆ కేసులో వాస్తవాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. పరిటాల రవిని చంపించినట్టు నన్ను కూడా చంపుతారని నా భార్య భయపడుతోంది. ఎన్నాళ్లు భయపడతాం? ఏం జరిగినా ధైర్యంగా ఉండమని నా భార్యకు చెప్పా. ఇంతకాలం ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులే నిజమైన హీరోలు. అమరావతి రైతులు, మహిళల పోరాటం కచ్చితంగా విజయవంతమవుతుంది. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చమంటే జగన్‌ ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేశారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం బదులు భారతి రాజ్యాంగం అమలవుతోంది. ప్రత్యేక హోదా మటన్‌ బిర్యానీ అయితే, ప్రత్యేక ప్యాకేజీ బఫె లాంటిది. అమరావతి రింగురోడ్డు కోసం రూ.20వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబితే సీఎం వద్దన్నారు’’ అని ఆదినారాయణరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని