UP Polls: పాకిస్థాన్‌ మద్దతుదారు.. జిన్నా భక్తుడు: అఖిలేశ్‌ని టార్గెట్‌ చేసిన యోగి

యూపీలో మరికొన్ని వారాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.....

Published : 29 Jan 2022 02:08 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొన్ని వారాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాకిస్థాన్‌కు మద్దతుదారులనీ.. జిన్నా భక్తులంటూ ధ్వజమెత్తారు. ఇటీవల మహమ్మద్‌ అలీ జిన్నాను స్వాతంత్ర్య వీరుడిగా అభివర్ణిస్తూ అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై యోగి మరోసారి మండిపడ్డారు.

‘‘వారు జిన్నాను ఆరాధిస్తే.. మేం సర్దార్‌ పటేల్‌ని ఆరాధిస్తాం. పాకిస్థాన్‌ వాళ్లకు ప్రీతికరమైనది. భారతమాత కోసం మేం జీవితాలను త్యాగం చేస్తాం’’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామ భక్తులపై కాల్పులు జరిగాయనీ.. కన్వార్‌ యాత్రలు రద్దయ్యాయంటూ మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రామ్‌లాలా విరాజ్‌మాన్‌ కల నిజమైందనీ.. కన్వారియాలపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించామన్నారు. దీపోత్సవ్‌, రంగోత్సవం యూపీకి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు.  కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉండటం వల్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించడంతో దిల్లీ నుంచి మేరఠ్‌కు ప్రయాణ సమయాన్ని నాలుగు గంటల నుంచి 40 నిమిషాలకు తగ్గించగలిగామన్నారు. మరి ఎస్పీ, బీఎస్పీ హయాంలో ఇది ఎందుకు జరగలేదో చెప్పాలని ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని