పచ్చని పల్లెలో ‘రాజకీయ చిచ్చు’! 

పచ్చని పల్లెలో రాజకీయం చిచ్చు రాజేసింది. ఆ ఊరి ఆనవాయితీకి గండి కొట్టింది. ఏకతాటిపై నిలిచి అభివృద్ధిలో ఆదర్శప్రాయంగా ఉన్న పల్లె పెద్దల్లో పంతాలొచ్చాయి.......

Published : 05 Feb 2021 02:03 IST

30 ఏళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పచ్చని పల్లెలో రాజకీయం చిచ్చు రాజేసింది. ఆ ఊరి ఆనవాయితీకి గండి కొట్టింది. ఏకతాటిపై నిలిచి అభివృద్ధిలో ఆదర్శప్రాయంగా ఉన్న పల్లె పెద్దల్లో పంతాలొచ్చాయి. 30 ఏళ్లుగా ఏకగ్రీవమవుతున్న ఆ గ్రామంలో సర్పంచ్‌ పదవికి పోటీ మొదలైంది. ఆనవాయితీ కొనసాగించాలని గ్రామ పెద్దలు.. బరిలో నిలవాల్సిందేనని కొందరు వ్యక్తులు పంతం పట్టారు. ఇంతకీ ఈ పంచాయతీలో నెగ్గేదెవరు?

అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామ పంచాయతీ జనాభా 1404 మంది. మొత్తం 997 ఓట్లు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామాభివృద్ధి కోసం అంతా ఏకతాటిపైనే ఉన్నారు. గ్రామ పెద్దలంతా కలిసి ఎవరిని సర్పంచ్‌గా నిర్ణయిస్తే వారికే అంతా మద్దతు తెలిపేవారు. అలా బడి, గుడి, రోడ్డు వంటి సౌకర్యాలతో గ్రామాన్ని అభివృద్ధిచేసుకున్నారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబు సీఎం హోదాలో ఈ గ్రామానికి వచ్చి అభివృద్ధిని ప్రశంసించారు. అయితే, పంచాయతీ ఎన్నికల విషయంలో సామరస్యంగా ఉండే గ్రామస్థుల మధ్య రాజకీయ పంచాయతీ మొదలైంది. ఏకగ్రీవానికి ప్రయత్నాలు సాగుతున్న సమయంలో అనూహ్యంగా రేషన్‌ డీలర్‌ బంధువు నామినేషన్‌ వేశారు. పోటీకి అభ్యర్థిని పెట్టకపోతే రేషన్‌ దుకాణం తొలగిస్తామని ఒత్తిడి తెచ్చారని గ్రామపెద్దల ఆరోపణ. నామినేషన్‌ వేసిన అభ్యర్థిని కనిపించకుండా దాచేశారని చెబుతున్నారు. కొన్ని రాజకీయ శక్తుల వల్ల పల్లెలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుందని మాజీ సర్పంచులు విచారం వ్యక్తంచేస్తున్నారు.

 

‘సుమారు 1981 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ పంచాయతీలే జరిగాయి. పెద్దల మాటే వినేవారు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. చెబితే వినడంలేదు. అరాచకశక్తులు కొన్ని చేరాయి. వాళ్లతో చేతులుకలిపి చేస్తున్నారు’ అని గ్రామ పెద్ద ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.

నేను 2013లో సర్పంచ్‌గా ఎన్నికయ్యా. చంద్రబాబు రచ్చబండలో పాల్గొని మంచి పనులు చేసినందుకు అభినందించారు. మాకు సహకరించారు. బాగా పనిచేశాం. ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం రెండు మూడు కుటుంబాలు అడ్డుపడుతున్నాయి - తాజా మాజీ సర్పంచ్‌, సుందరమ్మ

కప్పలబండలో ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాటను గ్రామస్తులు గౌరవిస్తారు. కానీ ఈసారి ఎవరు ఎంతగా చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామ పెద్దలు నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. 

అప్పుడు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు కొన్ని రాజకీయ శక్తుల వల్ల చాలా ఇబ్బందులపాలవుతున్నాం. కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నాం అని ఆ గ్రామస్థుడు ఒకరు తెలిపారు.

ఏకగ్రీవంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పల్లెలో ఎన్నికలు జరిగితే భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదీ చదవండి..

జమ్మలమడుగులో పంచాయితీల్లేని ‘పంచాయతీ’! 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని