Congress: కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. ‘ఆమె’ సీఎం కావాలంటూ ఆందోళనలు..!

హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రిగా ప్రతిభా సింగ్‌ (Pratibha Singh)ను ఎన్నుకోవాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆమె మద్దతుదారులు పార్టీ నాయకుడి కాన్వాయ్‌ను అడ్డగించి నినాదాలు చేశారు.

Published : 10 Dec 2022 01:54 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త సమస్య మొదలైంది. నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పార్టీలో సమన్వయం కుదరట్లేదు. ఈ క్రమంలోనే సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ (Pratibha Singh) మద్దతుదారులు ఆందోళనకు దిగారు. సొంత పార్టీకి చెందిన నేత కాన్వాయ్‌ను అడ్డుకుని ప్రతిభాకు మద్దతుగా నినాదాలు చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ హైకమాండ్‌.. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ (Bhupesh Baghel)ను రాష్ట్రానికి పంపింది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన సిమ్లాలోని ఒబెరాయి సెసిల్ హోటల్‌కు వచ్చారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రతిభా సింగ్‌ (Pratibha Singh)మద్దతుదారులు.. బఘేల్‌ వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ప్రతిభాను ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటూ నినాదాలు చేశారు.

కాగా.. సీఎం బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రతిభా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీ నాయకత్వ బాధ్యతలను సోనియాజీ అప్పగించారు. ఆ బాధ్యతలను నేను దిగ్విజయంగా నెరవేర్చారు. ఇప్పుడు సీఎంగా రాష్ట్రాన్ని కూడా నడిపించగలని విశ్వాసంతో ఉన్నాను. వీరభద్ర సింగ్‌ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినప్పుడు.. ఆయన కుటుంబాన్ని పక్కనబెట్టడం ఏమాత్రం సరికాదు’’ అని ఆమె అన్నారు. అయితే, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. తమ పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు లేవని ఆమె చెప్పడం గమనార్హం. హిమాచల్‌ కాంగ్రెస్‌లో అత్యంత కీలక నేత, మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్‌ సతీమణే ప్రతిభా సింగ్‌. ప్రస్తుతం ఆమె మండీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ పోటీ చేసి విజయం సాధించారు.

ఇక సీఎం రేసులో ప్రతిభా సింగ్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధిపతి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, మాజీ విపక్షనేత ముఖేశ్‌ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కుల్‌దీప్‌ సింగ్ రాఠోడ్‌, ఠాకుర్‌ కౌల్‌సింగ్‌, ఆశాకుమారి, హర్షవర్ధన్‌ చౌహన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని