Published : 17 Mar 2021 18:18 IST

తమిళనాట..ఉచితాలతో ఓట్ల వేట!

మేనిఫెస్టోల్లో ప్రాధాన్యత ఇస్తోన్న ద్రవిడ పార్టీలు

ఆర్థికంగా భారమేనంటోన్న ఆర్థికరంగ నిపుణులు

చెన్నై: ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు తాము చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుంచుతాయి. కానీ, ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి తమిళనాట రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ‘ఉచిత’ వాగ్దానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల కింద ప్రారంభమైన ఈ ఉచిత వాగ్దానాలు పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంపై ఈ తాయిలాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని ఆర్థికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఏప్రిల్‌ 6న జరిగే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అక్కడి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ‘ఉచిత’ గాలం వేసేందుకు సిద్ధమయ్యాయి.

ఉచితాలకే ప్రాధాన్యం..

డీఎంకే అధినేత కరుణానిధి 2006 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత కలర్‌ టీవీల పథకం ఇలాంటి తాయిలాలకు ఆద్యం పోసిందనే చెప్పవచ్చు. అనంతరం వచ్చిన ల్యాప్‌టాప్‌లు, మిక్సర్‌-గ్రైండర్‌ల నుంచి మంగళసూత్రాల వంటివి ఆ కోవలోకి చేరిపోయాయి. దాదాపు రెండు దశబ్దాల క్రితం మొదలైన ఈ ఉచిత ప్రస్తానం 2021 ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న ఏఐఏడీఎంకే, మరోవైపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేలు ప్రజలను ఆకర్షించేందుకు పోటాపోటీగా ఉచిత వాగ్దానాలకు సిద్దమయ్యాయి. వీటికితోడు కొత్తగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరమీదకు తేవడంతో పాటు రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదల అంశాన్నీ ఎన్నికల వాగ్దానంలో చేర్చాయి. ఉచితంగా వాషింగ్‌మెషిన్‌, ప్రతిఒక్కరికీ ఇళ్లు, సోలార్‌ కుక్కర్‌, విద్యారుణాల మాఫీ, ప్రతిఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం వంటి వాగ్దానాలతో ఏఐఏడీఎంకే మేనిఫెస్టోతో ముందుకొచ్చింది. అదే దారిలో వెళ్లిన డీఎంకే కూడా కొవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ.4వేల రూపాయలు, స్థానికులకే 75శాతం ఉద్యోగాలు, వివిధ రుణాల మాఫీ వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, మద్యం షాపులను దశలవారీగా తగ్గిస్తామని ఇరు పార్టీలు ప్రకటించడం విశేషం.

ఆర్థికంగా భారమే..

ఎన్నికల వాగ్దానాల్లో పార్టీలు చేసే ప్రకటనలు అధికారంలోకి వచ్చాక ఆర్థికంగా తీవ్ర భారమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునుపటి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు సమీకరించడం తలకుమించిన భారంగా అవుతాయని గుర్తుచేస్తున్నారు. ఇక ‘తమిళనాడులో రెండు పార్టీలు ప్రకటించిన ఉచిత వాగ్దానాలు అసాధారణమైనవి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని ఆ పార్టీలు అంచనా వేశాయో లేదో తెలియదని?’ అని కేంద్ర రెవెన్యూశాఖ మాజీ కార్యదర్శి ఎం ఆర్‌ శివరామన్‌ ఆశ్యర్యం వ్యక్తంచేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమనేది వాస్తవికతను అంచనా వేయకుండా చేసే హామీనేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే నిజమైతే, ఉద్యోగుల జీతాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అయితే, ఒకేసారి ఇచ్చే ఉచితాల వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం పడదని మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ షణ్ముగం అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాతి కాలంలోనూ తమిళనాడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, దేశ వృద్ధిరేటు తిరోగమనంలో ఉన్నప్పటికీ రాష్ట్ర వృద్ధి రేటు 2.2శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెండో దఫా కరోనా విజృంభణ వస్తే మాత్రం ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం గురించి చర్చించాల్సిందేనని స్పష్టంచేశారు.

గెలుపులో ఎవరి ధీమా వారిదే..!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై రెండు ప్రధాన పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వ పనితీరు, ఎన్నికల మేనిఫెస్టో, ఇప్పటివరకు సాధించిన వృద్ధి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి దోహదం చేస్తాయని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే వైగైసెల్వన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే కూడా వారి పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ‘ఎంకే స్టాలిన్‌, పార్టీ మేనిఫెస్టో’ రెండూ మా హీరోలు అని, మేము చేసిన ఎన్నికల హామీలు అమలు చేయదగినవేనని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్‌ స్పష్టంచేశారు. ఇక డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను మాత్రం భారతీయ జనతా పార్టీ విమర్శిస్తోంది. ఒక్క రూపాయికే బియ్యం ఇస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై 1967లో ప్రకటించారని, కానీ, అధికారంలోకి వచ్చాక దాన్ని సరిగా అమలుచేయడంలో విఫలమైనట్లు తమిళనాడు రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు ఎం చక్రవర్తి గుర్తుచేశారు. అంతేకాకుండా 2006 ఎన్నికల్లో పేదలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించిన డీఎంకే అమలు చేయలేకపోయిందన్నారు. ఇలా ఎన్నికల్లో గెలుపొందేందుకు ద్రవిడ పార్టీలు ఇలా ఉచిత హామీల బాట పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని