AIADMK: నాటు సారా దుమారం.. స్టాలిన్‌ రాజీనామా చేయాల్సిందే: ఏఐఏడీఎంకే

సీఎం స్టాలిన్‌కు పరిపాలన చేతకాదని, వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి డిమాండ్‌ చేశారు.

Published : 20 Jun 2024 17:17 IST

చెన్నై: తమిళనాడులో (TamilNadu) నాటు సారా తాగి 37 మంది మృతి చెందిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin) రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఏఐఏడీంకే డిమాండ్‌ చేస్తోంది. ఈ దారుణం వెనక డీఎంకే కార్యకర్తల హస్తం ఉందని మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు సాయం చేయాలన్నారు. సీఎం స్టాలిన్‌కు పరిపాలన చేతకాదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసినట్లు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. చట్టప్రకారం  చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరహా ఘటనలను నివారించడంలో విఫలమైన అధికారులపైనా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నవారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. విషాదంపై సీబీ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. 

కళ్లకురిచ్చి జిల్లాలోని కరుణాపురం ప్రాంతంలో నాటుసారా తాగి మంగళవారం నుంచి ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 18 మందిని పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, మరో ఆరుగురిని సేలంలోని మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో కె.కన్నకుట్టి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 200 లీటర్లకు పైగా అక్రమ సారాను సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని